
ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఓ రోగిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్ రావు(42) కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సోమవారం ఉయ్యూరులోని రోటరీ నేత్ర వైద్యశాలకు వచ్చారు. మంగళవారం ప్రభాకర్‌రావుకు శస్త్ర చికిత్స చేసి వార్డుకు తరలించారు. ప్రభాకర్‌రావు వార్డులో విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మందులు తేవడానికి బయటకు వెళ్లారు.
ఆ సమయంలో ఓ వ్యక్తి ఆస్పత్రి వార్డులోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాకర్‌రావు శరీరంపై పలుచోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. సీఐ నాగప్రసాద్, ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్ ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రావును వైద్యం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్ అని పోలీసులు భావిస్తున్నారు.