
అనంతపురం : ఇద్దరు కొడుకులతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతోనే భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. తండ్రీ కొడుకుల ఆత్మహత్యలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రఫీ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవాడు. హఠాత్తుగా ఏమయ్యిందో ఏమోగానీ రఫీ దారుణానికి ఒడిగట్టాడు. కన్న ప్రేమను మరిచి ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులు సోహెల్(6), ఇమ్రాన్(9) లను చెరువులో తోసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read More చపాతీ కర్రతో కొట్టి భార్య హత్య.. ఆ తరువాత ఆ భర్త చేసిన పని ఏంటంటే...
చెరువులో తండ్రీ కొడుకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు కొడుకులతో కలిసి రఫీ ఆత్మహత్య చేసుకోడానికి అతడి భార్యే కారణమని తెలుస్తోంది. ఆమెపై అనుమానాన్ని పెంచుకున్న రఫీ చివరకు కొడుకులతో కలిసి సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు.