సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో కీలక భేటీ.. ముందస్తు ఎన్నికల కోసమేనా..?

By Sumanth KanukulaFirst Published Mar 30, 2023, 9:47 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16,17 తేదీల్లో ఢిల్లీ పర్యటించిన సీఎం జగన్.. రెండు వారాల్లోనే మరోసారి ఢిల్లీ వెళ్లడంతో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16,17 తేదీల్లో ఢిల్లీ పర్యటించిన సీఎం జగన్.. రెండు వారాల్లోనే మరోసారి ఢిల్లీ వెళ్లడంతో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నెల 17న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి  అమిత్ షాలను సీఎం జగన్ కలిశారు. ఆ సమయంలో ఏపీకి సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు, నాయకులు స్వాగతం పలికారు. 

అయితే ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ బుధవారం రాత్రి  9.30 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను కలవనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తొలుత పేర్కొన్నాయి. అయితే అనుకున్న సమయానికి ఈ భేటీ జరగలేదు. రాత్రి 10.30 గంటల తర్వాత అమిత్ షా నివాసంలో ఆయనను సీఎం జగన్ కలిశారు. 30 నిమిషాలకు పైగా వీరిద్దరి మధ్య భేటీ జరిగింది.  ఇక, గురువారం రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురితో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ  పరిస్థితుల నేపథ్యంలో.. తక్కువ వ్యవధిలోనే సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని.. అందుకే కేంద్ర పెద్దలను కలిశారని ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కంటే ముందు.. సోమవారం సాయంత్రమే గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ ప్రతిపాదన గురించి తెలియజేశారని అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసి మరి అమిత్ షాతో సీఎం జగన్‌ భేటీ కావడం మరింత చర్చకు దారితీసింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తుకు వెళ్తారని.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు జోస్యం చెబుతూ వస్తున్నారు. తెలంగాణతో పాటే ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ ఆలోచనగా ఉందని.. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దల సహకారం  కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించి.. అసెంబ్లీని రద్దు చేస్తే.. కేంద్ర ఎన్నిక సంఘం నుంచి సహకరం అవసరమవుతుంది.

‘‘ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేనలకు సమయం ఇస్తే వారు మరింతగా బలపడేందుకు అవకాశం కల్పించినట్టుగా అవుతుందని సీఎం జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. పట్టభద్రుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడమే ఈ ఓటమికి కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార వ్యతిరేకత చెలరేగకముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తూ ఉండొచ్చు’’ అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే  తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైసీపీ సీనియర్ నాయకులు గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తమకు ప్రజలు ఐదేళ్ల పాలించేందుకు అవకాశం ఇచ్చారని.. ఆ గడువు పూర్తైన తర్వాతే నిబంధనల ప్రకారం ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రచారానికి తెరపడటం లేదు.

మరోవైపు తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తప్పించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఢిల్లీ పర్యటనలు అంటూ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇక, సీఎం జగన్ మరికొన్ని రోజుల్లోనే తాను విశాఖకు వెళ్లనున్నట్టుగా పలు సందర్బాల్లో తెలిపారు. అయితే అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాజధానిని మార్చడం, విభజించడం వంటి శాసనాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ద్వారా ఉపశమనం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులు అనేక ప్రయత్నాలు చేశారు.  అయితే జులై 11న ఈ కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ విషయాన్ని కూడా సీఎం జగన్.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలస్తోంది. 

click me!