
భీమవరం : కన్న కూతురుని లైగింక వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిని మందలించడమే ఆ తండ్రి ప్రాణాలమీదకు తెచ్చింది. చిల్లర చేష్టలకు పాల్పడుతున్న వాడిని అదుపులో పెట్టాల్సిన కుటుంబసభ్యులే అతడికి వంతపాడుతూ అమ్మాయి కుటుంబంపై గొడ్డళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఇలా ఆకతాయి కుటుంబసభ్యుల దాడిలో యువతి తండ్రి, సోదరుడితో పాటు మరోముగ్గురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన మానేపల్లి స్వామి, కంకిపాటి సుధాకర్ పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటున్నారు. అయితే స్వామి కూతురుపై కన్నేసిన సుధాకర్ కొడుకు చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
యువతి కుటుంబసభ్యులు మందలించినా చంద్రశేఖర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. యువతిపై అతడి లైంగిక వేధింపులు ఆగకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోనే మరోసారి తమ అమ్మాయి జోలికి వస్తే బావుండదని చంద్రశేఖర్ తో పాటు అతడి కుటుంబాన్ని యువతి కుటుంబం హెచ్చరించింది. అదరిముందు ఇలా పంచాయితీ పెట్టి అవమానించారని యువతి కుటుంబంపై కోపంతో రగిలిపోయిన యువకుడి కుటుంబం దారుణానికి ఒడిగట్టారు.
Read More ఉయ్యాలలో పడుకోబెట్టిన పసికందుపై కోతుల దాడి.. బొటనవేలు కొరికేసి బీభత్సం..
తెల్లవారుజామున యువతి తండ్రి స్వామి బహిర్భూమికి వెళ్లివస్తుండగా చంద్రశేఖర్ తో పాటు తండ్రి సుధాకర్, సోదరుడు జయకర్ గొడ్డుళ్లు, కత్తులతో దాడిచేసారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన యువతి సోదరుడు పవన్ తో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులపైనా దాడికి దిగారు. ఈ దాడిలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడగా కుటుంబసభ్యులు తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్వామి పరిస్థితి విషమంగా వుండటంతో కాకినాడ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు మండపాకకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అమ్మాయిని లైంగికంగా వేధించిన తమవాన్ని అదుపులో పెట్టుకోవాల్సింది పోయి యువతి కుటుంబంపైనే దాడికి దిగిన దుర్మార్గపు కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.