పోలీసులు కొట్టలేదు.. పట్టాభి చెప్పినదంతా అబద్ధమే, మా వాళ్లపై నిందలొద్దు : కృష్ణా జిల్లా ఎస్పీ

By Siva KodatiFirst Published Feb 22, 2023, 7:32 PM IST
Highlights

కస్టడీలో తనను పోలీసులు కొట్టారంటూ టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందించారు.  పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన వ్యాఖ్యానించారు. 

పట్టాభిని పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవమన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదన్నారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి 3 వాహనాల్లో మనుషులతో గన్నవరం వచ్చారని.. పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పట్టాభి సహా నిందితుల రిమాండ్, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి విషయంలో ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు. సుమోటోగా కేసు నమోదు చేసి.. 9 మందిని అరెస్ట్ చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. 

మరోవైపు.. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఘర్షణల్లో అరెస్ట్ అయిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాంను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నిన్న పట్టాభితో పాటు మరో 11 మందికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిన్న ఆయనను గన్నవరం సబ్ ‌జైలుకు తరలించారు. పట్టాభితో పాటు మరో 11 మందిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కొట్టిపాడు, కలపర్ర, టోల్‌గేట్‌ల భద్రతను కట్టుదిట్టం చేశారు. పట్టాభి వెనుక వేరే వాహనాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 

Also REad: చీకటి గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతూ... నాపై పోలీసుల థర్డ్ డిగ్రీ : టిడిపి నేత పట్టాభిరాం

కాగా.. కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో నిన్న(మంగళవారం) గందరగోళం నెలకొంది. పట్టాభికి ప్రాణహాని వుందంటూ ఆయన భార్య ఆందోళనకు దింగింది. ఈ క్రమంలో సాయంత్రం గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయమూర్తికి తెలిపారు. 

తనను అరెస్ట్ చేసిన పోలీసులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పట్టాభి తెలిపారు. స్టేషన్ లోని ఓ చీకటి గదిలోకి తనను ఈడ్చుకెళ్లి ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు విచక్షణారహితంగా కొట్టారని అన్నారు. ముఖానికి టవల్ చుట్టి అరికాళ్లు, అరచేతులపై లాఠీలతో కొడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభిరాం న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.  

అయితే పోలీసులు మాత్రం పట్టాభి తమతో దురుసుగా ప్రవర్తించాడని అంటున్నారు. గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న తనకు హాని కలిగించేలా పట్టాభి మరియు టిడిపి నాయకులు యత్నించారని సిఐ కనకరావు ఫిర్యాదు చేసారు. కులం పేరుతో దూషించారని సీఐ పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పట్టాభితో పాటు దొంతు చిన్నా, మరికొందరు టిడిపి నాయకులకు అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులోనే గన్నవరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 
 

click me!