మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: పరాకాష్టకు చేరిన అలేఖ్య ఉన్మాద భక్తి

By telugu teamFirst Published Jan 28, 2021, 6:47 PM IST
Highlights

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది. ఆమె విపరీతమైన ఆలోచన ధోరణికి గురైనట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తెలియజేస్తున్నాయి.

చిత్తూరు: పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు అలేఖ్య భక్తి ఉన్మాదమే విషాదకరమైన సంఘటనకు దారి తీసినట్లు అర్థమవుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో భక్తి ఉన్మాదంలో అలేఖ్య, సాయి దివ్య అనే అక్కా చెల్లెళ్ల దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే.

అలేఖ్య మూఢ విశ్వాసం, పునర్జన్మలపై అతి నమ్మకమే ఇరువురి హత్యకు దారి తీసినట్లు భావిస్తున్నారు. హత్యలకు ముందు సోషల్ మీడియాలో అలేఖ్య పెట్టిన పోస్టులు ఆమె విపరీత ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని అటున్నారు. తన పేరును మోహనిగా మార్చుకున్నట్లు ఈ నెల 22వ తేదీన ఓ పోస్టు పెట్టింది. తనను తాను ప్రపంచ సన్యాసిగా చెప్పుకుంది. ఆ తర్వాత శివ ఈజ్ కమింగ్.... వర్క్ ఈజ్ జన్ అని మరో పోస్టు పెట్టింది. శివుడిని ఆరాధించే అలేఖ్య చావుపుట్టుకలు తన చేతుల్లోనే ఉన్నాయనే భ్రమకు లోనైనట్లు తెలుస్తోంది. 

Also Read: మదనపల్లె జంట హత్యలు : అన్నం ముట్టని నిందితులు.. తిరుపతి రుయాకు సిఫారసు

కరోనా నేపథ్యంలో విధించిన కరోనా కారణంగా అలేఖ్య స్వగ్రామానికి వచ్చింది. నెలల తరబడి ఇంట్లో ఉంటూ వచ్చింది. తన సమయాన్ని పుస్తకాలు చదవడానికి వినియోగించింది. రాజకీయాలు, స్త్రీ సమానత్వం వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఆమె చదివినట్లు చెబుతున్నారు 

ఓ ఆధ్యాత్మికవేత్తను ఆమె తన గురువుగా భావించింది. ఆయన చెప్పిన మాటలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆయనను తన ప్రేమికుడిగా కూడా చెప్పుకుంది. తన స్టడీ రూంలో ఆయన ఫొటోను కూడా పెట్టుకుంది. ఆయన రాసిన పుస్తకాలను పఠించింది. వివాహ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయినట్లు కూడా ఆమె పోస్టులను బట్టి తెలుస్తోంది. జుట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్ పిరమిడ్ అని, అది అయస్కాంత శక్తిగా పనిచేస్తుందని చెప్పుకుంది.

Also Read: వాళ్లకు తాయెత్తులు కట్టాను, ఓ వ్యక్తి శంఖం ఊదాడు: మదనపల్లి అక్కాచెల్లెళ్ల మర్డర్స్‌పై భూత వైద్యుడు

ఈ నెల 15వ తేదీన అలేఖ్య తన సోషల్ మీడియాలో ఓ కవితను కూడా పోస్టు చేసింది. దాన్ని బట్టి ఆమె తీవ్రమైన నిరాశలో పడిపోయినట్లు అర్థమవుతోంది. "నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడం కోసం నేను ఎవరినో కావాలని ప్రయత్నిస్తున్నా... కానీ అవి ఫలించలేదు. నా ఆశలు దగ్ధమయ్యాయి. నిరాశ అనే అగాధంలో కూరుకుపోయాను. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయా. ఇలాంటి సమయంలో నాలో కొత్త ఆలోచనలు ఉదయించాయి. వాటిని హృదయపూర్వకంగా స్వీకరిస్తా" అని రాసుకుంది.

click me!