
అమరావతి: మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన విషయం వాస్తవమేనని కాబోయే శాసన మండలి చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన అనంతరం తనను శాసనమండలి చైర్మన్ గా ఎంపిక చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
మంత్రి పదవి కన్నా శాసన మండలి చైర్మన్ పదవి ఎంతో అత్యున్నతమైనదన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు పదవి కావాలని చంద్రబాబు నాయుడును అడగలేదన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించానని చెప్పుకొచ్చారు. పార్టీకి ఎప్పుడూ తాను విధేయుడినేనన్నారు. శాసనమండలి చైర్మన్ గా మళ్లీ ముస్లింలకే కేటాయించడం, శాసనమండలి విప్ గా ముస్లిం అభ్యర్థినే ఎంపిక చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.
ముస్లింలకు అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు మంచి అవకాశాలు ఇస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు జిల్లాలకు జెడ్పీ చైర్ పర్సన్ పదవులు, ఒక నగరానికి మేయర్ పదవులను మైనారిటీలకు కట్టబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.
తనను శాసనమండలి చైర్మన్ గా ఎంపిక చెయ్యడం చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన గౌరవంతో పాటు ముస్లిం సామాజికవర్గాన్ని గౌరవించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో ముస్లింలను టీడీపీకి మరింత దగ్గర చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్