నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరో మెలిక: ఎదురు తిరిగిన ప్రకటన

By telugu teamFirst Published Jan 25, 2021, 11:45 AM IST
Highlights

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వణ విషయంలో తాను చేసిన ప్రకటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎదురు తిరిగింది. 3.60 లక్షల మంది ఓటు హక్కును నిరాకరిస్తున్నందున నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన దాఖలైంది.

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరో మెలిక పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ సోమవారంనాడు ఆ పిటిషన్ దాఖలైంది.

రాజ్యంగంలోని 320 నిబంధన 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించిందని, ఆ హక్కును వినియోగించే అవకాశం లేకుండా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆ పిటిషన్ లో చెప్పారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం వల్ల దాదాపు 3.60 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతున్నారని, అది రాజ్యాంగం కల్పించిన హక్కుకు భగం కలిగిస్తోందని అన్నారు. ఈ పిటిషన్ మీద వాదనలను రేపు మంగళవారం వింటామని హైకోర్టు తెలియజేసింది.

Also Read: నిమ్మగడ్డకు దొరకని గవర్నర్ అపాయింట్ మెంట్: ఎన్నికల ప్రతిష్టంభన

గ్రామ పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తామని, పంచాయతీరాజ్ శాఖ అధికారుల అలసత్వం వల్ల తాజా ఓటర్ల జాబితాను రూపొందించలేదని, దాంతో 2019 జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించక తప్పడం లేదని, దానివల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా చెప్పారు. 

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో రమేష్ కుమార్ ఆ విషయం చెప్పారు. ఆయన చెప్పిన విషయం ఆయనకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. అలసత్వం ప్రదర్శించిన అధికారులపై తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని కూడా రమేష్ కుమార్ హెచ్చరించారు. 

Also Read: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్: ఏపీలో ఎన్నికలపై తీవ్ర సందిగ్ధత

పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మీద ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సిబ్బంది రాకపోవడంతో నామినేషన్ల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది.

ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయవద్దని ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ చేసిన విజ్ఞప్తిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో సిబ్బంది, అధికారులు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు.

click me!