బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన..

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 9:45 AM IST
Highlights

తూర్పు మధ్య, దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు  అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

తూర్పు మధ్య, దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు  అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండనుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  

ఈ క్రమంలోనే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు వెంటనే తిరిగిరావాలని సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. 

ఇక, బుధవారం రాత్రి నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు మరోసారి క్రీయాశీలకంగా మరినట్టుగా ఐఎండీ తెలిపింది. ఇది మధ్య, ద్వీపకల్ప, తూర్పు భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలలో రానున్న ఐదు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఏజెన్సీ అంచనా వేసింది. 

click me!