కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో కీలక సమావేశం.. ముగ్గురు నేతల డుమ్మా, చంద్రబాబు సీరియస్

By Siva KodatiFirst Published Sep 7, 2022, 9:47 PM IST
Highlights

ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశానికి ముగ్గురు కీలక నేతలు గైర్హాజరవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి వుందన్న ఆయన.. మారకుంటే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీకి చెందిన చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే నేతలు సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి వుందన్న ఆయన.. మారకుంటే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లా నేతలంతా ఉమ్మడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. అయితే ఇదే సమావేశానికి కీలక నేతలైన ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలు గైర్హాజరైన వ్యవహారంపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఢిల్లీలో వున్న కారణంగా కేశినేని.. విదేశీ పర్యటనలో వున్నందున దేవినేని, బొండా ఉమాలు ఈ భేటీలో పాల్గొనలేకపోయారు. 

ఇకపోతే.. ఇటీవ‌ల ప్ర‌త్య‌ర్థుల దాడిలో గాయ‌ప‌డ్డ చెన్నుపాటి గాంధీని మంగ‌ళ‌వారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. గ‌త వారం ప్ర‌త్య‌ర్థుల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత విజ‌య‌వాడ‌లోని ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ మంగళవారం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్‌‌లో ప‌రామ‌ర్శించి, చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండ‌గా వుంటుంద‌ని, అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని లోకేష్ ధైర్యం చెప్పారు.

ALso REad:ధైర్యంగా వుండండి.. అండగా వుంటాం : చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేష్

మరోవైపు... చెన్నుపాటి గాంధీపై దాడి వ్య‌వ‌హ‌రంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వ‌దిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడి అనంత‌రం చంద్రబాబు నాయుడు..  గాంధీ ఇంటికి వెళ్లి ప‌రామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఇది పిరికిపంద‌ల చ‌ర్య అని, ఓడిపోతామనే భ‌యంతో వైసీపీ నాయ‌కులు దాడికి  పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు

click me!