
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై కమలం పార్టీ కన్నేసింది. మొన్నటి ఉత్తరాంధ్ర ఎంఎల్సీ ఎన్నికల్లో భాజపా గెలిచేసింది. ఎలా గెలిచిందనడక్కండి. గెలిచిందంటే గెలిచేసిందంతే. ఏదో అదృష్టం కొద్దీ పిడిఎఫ్ అభ్యర్ధిపై కొద్దిపాటి తేడాతో నానా అవస్తలు పడి నెగ్గింది. అయితే, బలం మేరకే తాను గెలిచానని భాజపా అనుకుంటోంది. అనుకోవటమే తరువాయి జివిఎంసిపై కన్నేసింది.
విశాఖపట్నంలో ఇప్పటికే ఎంపి, ఎంఎల్ఏలున్న సంగతి తెలిసిందే కదా. ఆబలంతోనే భాజపాను పట్టటం అప్పుడప్పుడు కష్టంగా ఉంటోంది. దానికి ఇపుడు ఉత్తరాంధ్ర ఎంఎల్సీ కూడా తోడైంది. దాంతో ఆ పార్టీ నేతలు ఎక్కడా ఆగటం లేదు. ఎప్పుడైతే ఎంఎల్సీ కూడా కమలం పార్టీ గెలిచేసిందో వెంటనే జివిఎంసిలో పోటీ చేయాల్సిందేనంటూ భాజపా నేతలు ఫిక్స్ అయిపోయారు. అదే మాటను జాతీయ నాయకత్వానికి చెప్పటం వారు కూడా మద్దతు ఇవ్వటం జరిగాయట.
టిడిపి మద్దతు పూర్తిగా అందకపోయినా ఉత్తరాంధ్ర ఎంఎల్సీ ఎన్నికల్లో స్వంత బలంతోనే గెలిచామని కమలం నేతల అనుకుంటున్నారు. ఎంపిగా గెలవటం, ఎంఎల్ఏ అవ్వటం, ఎంఎల్సీగా నెగ్గటం కన్నా జివీఎంసి మేయర్ పీఠాన్ని అధిష్టించటం చాలా ప్రిస్టేజ్ అన్న విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకే కమలం పార్టీ గట్టిగా పట్టుపట్టాలని అనుకుంటోంది.
అదే విషయాన్ని కమలంపార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారు.ఇటీవలే అనంతపురంలో జరిగిన పథాధికారుల సమావేశాల్లో కూడా చర్చకు వచ్చినట్లు సమారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం పార్టీ గెలిచినప్పటి నుండి రాష్ట్రంలో భాజపా నేతలను పట్టటం కష్టంగా ఉంది. యూపిలో వర్షం పడితే ఇక్కడ గొడుగు వేసుకుని తిరిగేట్లుగా ఉన్నారు. అంతా కాల మహిమ. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత భాజపా పట్ల చంద్రబాబు వైఎఖరిలో కూడా మార్పు కనబడుతోంది. దాంతో కమలం పార్టీ జాతీయ నాయకత్వం జివిఎంసి మేయర్ సీటు కోసం పట్టుబడితే కాదనలేని పరిస్ధితే. ఆ విషయాన్ని గ్రహించే రాష్ట్రంలోని కమలం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.