లక్ష్యం ఒకటే.. మార్గాలే వేరు

Published : Apr 03, 2017, 04:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
లక్ష్యం ఒకటే.. మార్గాలే వేరు

సారాంశం

‘ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా ముఖ్యం..బుల్లెట్ దిగిందా లేదా అంతే’ అన్న డైలాగ్ ను చంద్రబాబు బాగా వంటబట్టించుకున్నట్లుంది కదా?

అధికార, ప్రతిపక్ష నేతల లక్ష్యం ఒకటే. అనుసరిస్తున్న మార్గాలే వేరు. లక్ష్యాన్ని చేరుకోవటంలో ఒక్కో నేతది ఒక్కో మార్గం. ఇక్కడే నేతల మనస్తత్వాలు బయటపడుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ ప్రక్షాళన నేపధ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాలను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. ఇక్కడే ఈ తరంలో చాలామందికి తెలీని ఓ విషయాన్ని చెప్పుకోవాలి.

1982లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్ధాపించారు. అప్పటికే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కోసం జనాలు చూస్తున్నారు. అందుకే ఎన్టిఆర్ టిడిపిని పెట్టగానే పొలోమంటూ కాంగ్రెస్ నేతల్లో చాలామంది ఎన్టీఆర్ దగ్గరకు పరుగులు తీసారు. తామంతా టిడిపిలో చేరుతామంటూ దరఖాస్తులు పెట్టున్నారు. ఇలా వచ్చిన వారిలో మంత్రులున్నారు, ఎంఎల్ఏ, ఎంపిలు కూడా ఉన్నారు. సరే, అన్నగారి మీద అభిమానంతో వచ్చిన వారు ఎటూ ఉంటారు కదా?

అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది అందరికీ. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు ఎన్టీఆర్ ఓ షరతు విధించారు. అదేంటంటే, ఇతర పార్టీల్లో నుండి టిడిపిలోకి రాదలచుకున్న వారందరూ తమ పదవులకు రాజీనామాలు చేయాలని. రాజీనామాలు చేసి వస్తేనే టిడిపిలోకి చేర్చుకుంటానంటూ ఎన్టీఆర్ గట్టిగా చెప్పారు. దాంతో అన్నగారి మీద అభిమానంతో, నమ్మకంతో వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ టిడిపిలో చేరారు. అది నాయకత్వం మీద నమ్మకమంటే. అది విలువలంటే.

సరే, అదంతా గతం. ఇక ప్రస్తుతానికి వస్తే దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ పెట్టిన షరతులనే వైసీపీ స్ధాపించినపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధించారు. వైసీపీ స్ధాపించగానే కాంగ్రెస్, టిడిపిలో నుండి చాలామంది నేతలు చేరేందుకు ఉత్సాహం చూపారు. అయితే, జగన్ వెంటనే ఎవరినీ చేర్చుకోలేదు. తమ పదవులకు రాజీనామాలు చేస్తే గానీ వైసీపీలోకి చేర్చుకోనంటూ షరతు విధించారు. దాంతో మంత్రిపదవులకు, ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసి కాంగ్రెస్, టిడిపిల నుండి పలువురు వైసీపీలో చేరారు.

ఇపుడిదంతా ఎందుకంటే, మంత్రివర్గం ఏర్పాటులో చంద్రబాబునాయుడు అనుసరించిన విధానంపై గగ్గోలు జరుగుతోంది కాబట్టి. పై ఇద్దరికీ భిన్నమైనది చంద్రబాబునాయడు మనస్తత్వం. అధికారం అందుకోవటానికి మొదటి ఇద్దరు విధానాలు వేరైతే చంద్రబాబుకు మాత్రం మార్గం ముఖ్యం కాదు. లక్ష్యాన్ని అందుకున్నామా లేదా? అదే ముఖ్యం. అదేదో సినిమాలో ‘ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా ముఖ్యం..బుల్లెట్ దిగిందా లేదా అంతే’ అన్న డైలాగ్ ను చంద్రబాబు బాగా వంటబట్టించుకున్నట్లుంది కదా?

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?