Nara Lokesh: ఇక నుంచి గాలి పీల్చినా.. వదిలినా ట్యాక్స్ లే.. సీఎం జ‌గ‌న్ పై నారా లోకేష్ ఫైర్..

By Rajesh KFirst Published Apr 13, 2022, 10:47 PM IST
Highlights

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు, వివిధ రకాల పన్నులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌పై   పెను భారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సుల వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్నినారా లోకేష్  తీవ్రంగా ఖండించారు. 
 

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆర్టీసీ ఛార్జీలు పెంచ‌డంపై జ‌గ‌న్ స‌ర్కార్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.  వైయస్ జ‌గ‌న్ జోరు చూస్తుంటే.. గాలి పీల్చినా, వదిలినా  టాక్సులు వసూలు చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడుకి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం అంటూ సోషల్ మీడియా వేదికగా లోకేష్ మండిపడ్డారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధ‌వారం మంగళగిరి నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు. తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండ గ్రామంలో పర్యటించిన నారా లోకేష్ .. ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఇంటికో కోవొత్తు, అగ్గిపెట్టె పంచిపెట్టారు. 

ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాల‌ను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళారు. గతంలో రూ.500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు సుమారుగా రూ.1600 వస్తుందని గ్రామ‌స్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను లోకేష్ దృష్టికి తెచ్చిన ప్రజలు. వేసవిలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని ప్రజలు కోరారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం రోజు విద్యుత్ ధరలు తగ్గించేస్తా అని సీఎం హామీ ఇచ్చార‌నీ. మాట తప్పి 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారనీ, అందుకే ఆయన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాస్తా.. జగన్ మోసపు రెడ్డి గా మారార‌ని ఏద్దేవా చేశారు. 

బాదుడే బాదుడు అంటూ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తెచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు రెండు సార్లు, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారని, నిరుద్యోగులకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారనీ.. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ, ఆయన బంధువులకు నెల‌కు రూ.3 లక్షల జీతం ఇచ్చి సలహాదారులుగా నియమించుకున్నారు.. తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులంతా డమ్మీలేన‌నీ, ఒక్కో మంత్రి చుట్టూ సొంత సామాజిక వర్గానికి చెందిన నలుగురు సలహదారులను నియమించుకున్న‌రనీ, వాళ్ళు ఎక్కడ సంతకం చెయ్యమంటే.. అక్కడ మంత్రులు సంతకాలు పెడుతార‌ని విమ‌ర్శించారు. కాళ్ళు మొక్కే బానిసలనే మంత్రులుగా నియమించుకున్నారు. భజన చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారని విమ‌ర్శించారు. ఉప కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసారనీ, ఎన్ని నిధులు ఇచ్చారు. ఎవరి జీవితాలు మారాయి? సామాజిక న్యాయం అంటున్న సీఎం చర్చకు సిద్ధమా? అని స‌వాల్ విస‌రారు. బడుగు, బలహీన వర్గాల వారి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనీ, అమ్మ ఒడి లాంటి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు చూపించి సామాజిక న్యాయం అంటే ఎలా? పేదల ఉపాధి కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా మంత్రి పదవులు ఇచ్చాం అంటే సరిపోతుందా? అని ప్ర‌శ్నించారు. 

క‌రెంట్ కోత‌ల‌పై మాట్లాడుతూ.. పవర్ హాలిడే వలన పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయ‌నీ, లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని,బెదిరింపులు, పవర్ హాలిడే తో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించి, 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చే వరకూ బాదుడే బాదుడు పేరుతో చేస్తున్న పోరాటం ఆగదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

click me!