
తెలుగుదేశం యువరాజు చట్టసభలో ప్రవేశించేందుకు దొడ్డిదారి సిద్ధమైనట్లే కనబడుతోంది. అందుకు అవసరమైన మార్గాన్ని చంద్రబాబునాయుడు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే మార్చి నెలలో లోకేష్ ను శాసనమండలికి ఎంపిక చేయాలని దాదాపు నిర్ణయమైనట్లు సమాచారం. మార్చిలో 22 ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయి. అందులో ఎంఎల్ఏ కోటాలో ఎంపికయ్యే ఎంఎల్సీ స్ధానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్ధితిలో లోకేష్ ను ఎంఎల్సీగా ఎంపిక చేయటమే సేఫ్ మార్గంగా చంద్రబాబు భావిస్తున్నారు.
లోకేష్ ఎంపిక కోసం పదవీ త్యాగం చేయటానికి ఎందరో త్యాగరాజులు క్యూలో నిలబడ్డారు. అయితే, ఎందుకనో చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. అయితే, లోకేష్ పదవి కోసం ఇంటిపోరు ఎక్కువైపోతున్నట్లు సమాచారం. దాంతో చంద్రబాబు ఒత్తడికి తలొగ్గినట్లు కనబడుతోంది. ఎంఎల్సీగా ఎంపిక చేయటం ద్వారా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న డిమాండ్.
ప్రస్తుత ఎంఎల్ఏల్లో లోకేష్ కోసం రాజీనామా చేయటానికి చాలామందే సిద్ధంగా ఉన్నారు. అయితే, వారెవరిచేతనైనా రాజీనామా చేయిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. ఎందుకంటే, ఇప్పటికే వైసీపీ నుండి 22 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. వారు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే టిడిపిలో కొనసాగుతున్నారు. వారిచేత రాజీనామాలు చేయించే ఉద్దేశ్యం చంద్రబాబులో కనబడటం లేదు.
ఎందుకంటే, వారుగనుక రాజీనామా చేస్తే అక్కడ మళ్లీ ఉపఎన్నిక నిర్వహించాలి. ఉపఎన్నిక నిర్వహిస్తే మళ్ళీ వారి గెలుస్తారన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. ఒకవేళ వారు గనుక ఓడిపోతే చంద్రబాబు పరువు కొండవీటివాగులో కలిసినట్లే. అపుడు ఫిరాయింపు నేతలు టిడిపిలో చెల్లని కాసులే. ఫిరాయింపు ఎంఎల్ఏల చేత రాజీనామాలు చేయించమని వైసీపీ నేతలు ఎంత డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు అందుకే పట్టించుకోవటం లేదు.
ఓ వైపు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని ప్రచారం బాగా జరుగుతోంది. ఇటువంటి పరిస్ధితిల్లో లోకేష్ గనుక ఎంఎల్ఏగా పోటీ చేయదలిస్తే ఉపఎన్నిక ఒక్క లోకేష్ కే పరిమితమవ్వదు. ఫిరాయించిన 22 మంది నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఓడేవారెవరో? గెలిచేవారెవరో? అపుడు లోకేష్ గెలుపు గాలిలో దీపమే. కాబట్టి దొడ్డిదారే యువరాజు మార్గంగా నిర్ణయమైపోయినట్లే. అయితే ఇదే విషయమై లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానన్నారు. ఎంఎల్సీ గా పోటీ చేసే విషయం ఊహాగానాలేనన్నారు.