
చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తన వ్యక్తిగత ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సిఎం వృధా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించటమే చంద్రబాబు దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.
అటువంటి సదస్సులో ప్రసంగించే అవకాశం ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, ఎస్బిఐ ఛైర్ పర్సన్ అరుంధతి బట్టాఛార్య, ఇద్దరు జర్నలిస్టులకు మాత్రమే వచ్చింది. అదే సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు కూడా సుమారు 12 మంది బృందంతో వెళ్లారు.
అయితే, సదస్సులో ప్రసంగించే అవకాశం లేనపుడు చంద్రబాబు దావోస్ ఎందుకు వెళ్ళినట్లు? దావోస్ కు వెళ్ళకపోతే ప్రిస్టేజ్ దెబ్బతింటుందని చాంద్రబాబు అనుకున్నారా? ప్రసంగించే వారి జాబితాలో పేరు లేకపోయినా చంద్రబాబు వెళ్ళారంటే కేవలం పబ్లిసిటీ స్టంట్ అనే అనుకోవాలి. చంద్రబాబు వెళ్ళటమే దండగనుకుంటే మళ్ళీ పెద్ద బృందం ఒకటి అదనంగా.
ఇదే విషయాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తావించారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు వృధా చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రసంగించే అవకాశం లేనపుడు చంద్రబాబు దావోస్ కు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ సిఎం చేసిన విదేశీప్రయాణాల వల్ల రాష్ట్రానికి జరిగిన మేలు ఏమిటి వివరించాలని నిలదీసారు.
ఒక వ్యక్తి దావోస్ సదస్సుకు హాజరయ్యేందుకు భారత్ నుండి వెళ్లి రావాలంటే భారీగా వ్యయం అవుతుంది. భారత్ నుండి స్విట్జర్లాండ్ కు వెళ్లటం, అక్కడి నుండి దావోస్ చేరుకోవటం, మళ్లీ అక్కడ మూడు రోజుల బస, వసతి తదితరాలన్నీ కలుపుకుని సుమారు 40 వేల డాలర్లు అవుతుంది. ఈ లెక్కన చంద్రబాబు, బృందానికి ఎంత వ్యయం అయ్యుంటుందో? అంతేకాకుండా చంద్రబాబుకు ఆహ్వానాన్ని వచ్చేట్లు చేసిన ఏజెంట్ ప్రైస్ హౌస్ వాటర్ కూపర్ కు చెల్లించాల్సిన ఫీజు అదనం.
ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసి దావోస్ పర్యటనకు వెళ్లటం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు రాష్ట్రం ఆర్ధిక సమస్యల్లో ఉందని చెబుతూనే మరోవైపు ప్రచారార్భాటాలకు కోట్ల రూపాయలను దుబారా చేయటానికి చంద్రబాబు అలవాటు పడ్డారంటూ మండిపడుతున్నారు. ఈ లెక్కన గతంలో రెండుసార్లు దావోస్ వెళ్లింది కూడా ఈ పద్దతిలోనేనా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.