ప్రాజెక్టుల్లో అవినీతి నిజమేనా ?

Published : Jan 18, 2017, 02:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ప్రాజెక్టుల్లో అవినీతి నిజమేనా ?

సారాంశం

ప్రాజెక్టుల అమలులో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడటానికి స్వయంగా ప్రభుత్వమే అవకాశం ఇస్తున్నట్లవుతోంది.

ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలనకు గానీ అంచనా వ్యయాల పరిశీలనకు గానీ ప్రజా అంచనాల కమిటికి ఉన్నతాధికారులు ఎవరూ సహకరించపోవటంతో అనుమానాలు బలపడుతున్నాయి.       బాబునాయుడు ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులను ఏమాత్రం లెక్కచేయటం లేదు. ఒకవిధంగా పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అసెంబ్లీ కమిటీలైన ప్రజా పద్దుల కమిటి (పిఎసి), ప్రజా అంచనాల కమిటి (పిఇసి) సమావేశాలు మంగళవారం హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. పై రెండు కమిటీలు కూడా రాజ్యాంగబద్దమైన కమిటీలే.

 

ఇందులో పిఏసికి ఛైర్మన్ గా ప్రతిపక్ష వైసీపీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి కాగా అంచనాల కమిటికి ఛైర్మన్ గా అధికారపార్టీ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఉన్నారు. రెండు కమిటీల్లోనూ టిడిపి, భాజపా, వైసీపీ ఎంఎల్ఏలే సభ్యులు. వివిధ శాఖల్లో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు, వాటి అంచనాలు తదితరలను కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి.

 

అటువంటిది, అంచనాల కమిటి ఏర్పాటుకాగానే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం, పట్టిసీమ, పుష్కరం, తాడిపూడి, వెంకటనగరం, చింతలపూడి, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల వ్యయాలు, అంచనా వ్యయాలపై సమీక్ష చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, సాధ్యం కావటం లేదు. ఎందుకంటే, పై పనులన్నీ స్వయంగా సిఎం, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

 

ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి పై పథకాల అంచనా వ్యయాలు వేల కోట్లకు చేరుకుంటున్న వైనం బాగా ప్రచారంలో ఉంది. ఆ విషయాలపై పరిశీలన జరిపేందుకు కమిటి ఎన్నిమార్లు ప్రయత్నించినా ఎవరూ సహకరించటం లేదు. క్షేత్రస్ధాయి పరిశీలనకు ఏర్పాట్లు చేయాల్సిన అసెంబ్లీ ఉన్నతాధికారులూ సహకరించటం లేదు. అటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులూ పట్టించుకోవటం లేదు. ఇదే పరిస్ధితి పిఏసి సమావేశాల్లో కూడా కనబడుతోంది. సమావేశాల తేదీలను ముందుగా తెలియజేసినా ఉన్నతాధికారులు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.

 

దాంతో అసలు కమిటిలున్నది ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. కమిటిల అస్తిత్వాన్ని స్వయంగా ప్రభుత్వమే నీరుగార్చేస్తుండటం గమనార్హం. కమిటీలు పరిశీలనకు వెళ్లేందుకు లేదు, సమావేశాలకు ఉన్నతాధికారులు హాజరవ్వటంలేదు. దాంతో ప్రాజెక్టుల అమలులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే అనుమానాలు బలపడటానికి స్వయంగా ప్రభుత్వమే అవకాశం ఇస్తున్నట్లవుతోంది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?