
‘సొంతగడ్డ నుండి పరిపాలించాలన్న పట్టుదలతో అమరావతిలో కష్టపడి అద్భుత అసెంబ్లీని నిర్మించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు’...ఇవి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, చంద్రబాబు కొడుకు లోకేష్ పలికిన పలుకులు. అసెంబ్లీలో తొలిసారి లోకేష్ మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు లేండి. ఇంతమంది సీనియర్లున్న సభలో మాట్లడటం నిజంగా తన అదృష్టమన్నారు. లోకేష్ మాటలు విన్నవారికి ఇక్కడే ఓ అనుమానం మొదలైంది.
నారా లోకేష్ చెప్పినట్లు నిజంగానే సొంతగడ్డ మీద నుండి పరిపాలించేందుకే చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసారా? అందరూ ‘ఓటుకునోటు’ కేసులో నుండి బయటపడేందుకే హైదరాబాద్ ను వదిలేసారని అనుకుంటున్నారే ? ఎందుకంటే, అంతకుముందు ఓసారి చంద్రబాబు హైదరాబాద్ లో మాట్లాడుతూ, టిడిపిని మళ్ళీ తెలంగాణాలో అధికారంలోకి తెచ్చేంత వరకూ హైదరాబాద్ ను వదిలేది లేదని స్పష్టంగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొద్ది రోజులకే హైదరాబాద్ ను వదిలేసారంటే ఏమని అర్ధం?
ఇక ప్రస్తుత విషయానికి వస్తే వెలగపూడిలో నిర్మించింది అద్భుత అసెంబ్లీ అట. చిన్నపాటి వర్షానికి కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల ఛాంబర్లు కూడా ఏకధాటిగా వర్షపు నీరు లీకైన విషయం అందరూ చూసిందే. సిఎం కొలువై ఉన్న భవనంలో కూడా వర్షం నీళ్ళు లీకవుతోందని వార్తలు వచ్చాయి. సుమారు రూ. 1100 కోట్లు పెట్టినా నిర్మించింది ఇంత నాసిరకం భవనాలనా అని అందరూ ఆశ్చర్యపోతుంటే లోకేష్ కు మాత్రం అద్భుత కట్టడాలుగా దర్శనమిస్తున్నాయి. ఏం చేస్తాం పచ్చపాలన అంటే ఇలాగే ఉంటుంది.