
అనంతపురం: జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలం సింగవరం వద్ద రోడ్డుపై మహిళ నడుచుకుంటూ వెళ్తున్న స.మయంలో ఆకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. దీంతో మహిళ చిత్రావతి నది వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ మహిళను కాపాడారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చిత్రావతి నదికి వరద పోటెత్తింది. ఎల్లనూరు మండలం సింగవరం వద్ద రోడ్డుపై మహిళ నడుచుకుంటూ వెళ్తుంది. ఈ రోడ్డు పక్కనే నది ప్రవహిస్తుంది. భారీ వరద కారణంగా రోడ్డు కుంగిపోయింది. మహిళ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలోనే రోడ్డు కుంగిపోవడంతో ఆమె రోడ్డుపైనే కూలబడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు తక్షణమే స్పందించి ఆ మహిళకు చేయి అందించి ఆమెను కాపాడారు. మరికొన్ని క్షణాలు ఆ కుంగిపోయిన రోడ్డుపై ఉంటే వరద నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో స్పందించిన స్థానికులకు మహిళ ధన్యవాదాలు చెప్పారు.
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. తాడిపత్రిలో 16.02 మి.మీ, యాడికిలో 20 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం కారణంగా యాడికి-తాడిపత్రి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్కకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. రాయలసీమ, కోస్తాలోని పలు జిల్లాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.