లోకేష్ ఇలాకాలో టిడిపికి బిగ్ షాక్... జగన్ సమక్షంలో వైసిపిలోకి గంజి చిరంజీవి

By Arun Kumar PFirst Published Aug 29, 2022, 1:40 PM IST
Highlights

ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పదవితో పాటు ప్రాాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మంగళగిరికి చెందిన కీలక నాయకుడు గంజి చిరంజీవి తాజాగా  వైఎస్ జగన్ సమక్షంలో వైసిపిలో చేరాడు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన గంజి చిరంజీవి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన చిరంజీవి వైసిపి కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ జాయినింగ్ కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరులు కూడా పాల్గొన్నారు. 

చిరంజీవి దంపతులకు స్వయంగా వైఎస్ జగన్ వైసిపి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాలువాతో సత్కరించిన గంజి చిరంజీవి పుష్ఫగుచ్చం అందించారు. చిరంజీవి చేరికతో మంగళగిరిలో వైసిపి మరింత బలోపేతం కానుంది. 

ఇదిలావుంటే గంజి చిరంజీవి పార్టీని వీడటం టిడిపికి పెద్దదెబ్బే అని చెప్పాలి. గుంటూరు జిల్లా మంగళగిరిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయన గెలుపుకోసం గంజి చిరంజీవి పనిచేసారు. అయినప్పటికి వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో లోకేష్ ఓటమిని చవిచూసారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవి కూడా వైసిపిలో చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరిగిందని చెప్పాలి. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయన మంగళగిరి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో స్థానికంగా కీలక నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి టిడిపిని వీడి షాకిచ్చారు. లోకేష్ ను టార్గెట్ చేసిన వైసిపి అధిష్టానం మంగళగిరిలో మరోసారి ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నట్లు సమాచారం. ఇలా ఎన్నికలకు చాలా సమయమున్నా ఇప్పటినుండే లోకేష్ ను ఓడించేందుకు వైసిపి చర్యలు ప్రారంభించింది. 

Video నారా లోకేష్ కు భారీ షాక్... కన్నీరు పెట్టుకుంటూ టిడిపికి గంజి చిరంజీవి రాజీనామా

ఇక టిడిపికి రాజీనామా ప్రకటన సమయంలో చిరంజీవి బాగా ఎమోషన్ అయ్యారు. తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా టీడీపీలో కొందరు మానసికంగా హత్య చేశారని ఆరోపించారు. బీసీ నేత అయినందునే తనను అవమానించారని చెప్పారు. తన రాజీనామాను ప్రకటిస్తూ మీడియా ఎదుటే చిరంజీవి కన్నీటి పర్యంతం అయ్యారు.

మున్సిపల్ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పదవుల కోసం రాజీనామా చేయలేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే రాజీనామా చేశానని అన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఇస్తానని మోసం చేశారని గంజి చిరంజీవి ఆరోపించారు. మంగళగిరి టికెట్ ఇవ్వకపోవడంతో.. అధికార ప్రతినిధి పదవి ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని చిరంజీవి అన్నారు.  

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మంగళగిరి నుండి లోకేష్ బరిలోకి దిగారని... అయినా ఆయన గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసానని చిరంజీవి అన్నారు. ఇలా తన రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి పార్టీకి సేవచేసినా గుర్తింపు లేకుండా పోయిందన్నారు. అందుకు టిడిపిని వీడినట్లు తెలిపిన చిరంజీవి తాజాగా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 

click me!