జగన్ ఆశయసాధన కోసమే.. బెయిల్ రద్దు కావాలని ప్రార్థిద్ధాం... : రఘురామ

By AN TeluguFirst Published Jul 31, 2021, 8:05 AM IST
Highlights

 బెయిల్ షరతులను జగన్ రెడ్డి ఏ విధంగా ఉల్లంఘించారో అనేక ఆధారాలతో కళ్లకు కట్టినట్లు కోర్టుకు సమర్పించామని తెలిపారు. ‘ఒకవేళ పొరపాటున నా నమ్మకానికి భిన్నంగా తీర్పు ప్రతికూలంగా వస్తే, హైకోర్టుకు వెళ్తా, అక్కడా న్యాయం జరగకపోతే ఆ పైకోర్టుకు వెళ్తా’ అని ఆయన తెలిపారు.

‘ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కేసుపై ఆగస్టు 25న సిబిఐ కోర్టు తీర్పుతో నా పిటిషన్ కు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అప్పటివరకు న్యాయమే గెలవాలంటూ న్యాయదేవతను ప్రార్థిద్దాం’ అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బెయిల్ షరతులను జగన్ రెడ్డి ఏ విధంగా ఉల్లంఘించారో అనేక ఆధారాలతో కళ్లకు కట్టినట్లు కోర్టుకు సమర్పించామని తెలిపారు. ‘ఒకవేళ పొరపాటున నా నమ్మకానికి భిన్నంగా తీర్పు ప్రతికూలంగా వస్తే, హైకోర్టుకు వెళ్తా, అక్కడా న్యాయం జరగకపోతే ఆ పైకోర్టుకు వెళ్తా’ అని ఆయన తెలిపారు.

ఏ-1 నిందితుడు జగన్ రెడ్డి కి తోడుగా ఉండేందుకు విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయమని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ, ప్రీ ప్రైమరీ నుంచే పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించడం బాధాకరమని  రఘురామ అన్నారు.

మాతృభాషను చులకన చేస్తున్నారని.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది.. అని ప్రశ్నించారు. జగన్ ఆశయసాధనకోసం శాసన మండలి రద్దుకు కృషి చేస్తానన్నారు. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖమంత్రులను కలుస్తానన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.  మర్యాదపూర్వకంగానే మంత్రిని కలిశానని, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులన్నీ వివరించినట్లు తెలిపారు. 

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ 30కి వాయిదా..

కాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు  ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీకి వాయిదా వేసింది.  ఈ కేసుకు సంబంధించి శుక్రవారంనాడు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణకే నిర్ణయం వదిలేశామని దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. 

కాగా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గతంలో జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు.  అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఇవాళ సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. ఈ కేసుపై విచారణను ఆగష్టు 25 వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

click me!