ఎన్‌టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. లక్ష్మీ పార్వతిపై వంగలపూడి అనిత ఫైర్

By telugu teamFirst Published Nov 20, 2021, 7:47 PM IST
Highlights

వైసీపీ నేతలకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి లక్ష్మీ పార్వతి మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. ఎన్‌టీఆర్ కుటుంబంపై ప్రేమ ఉన్నదని వల్లించి ఈమె ఎన్‌టీఆర్ కుటుంబంలోని మహిళపై వైసీపీ నేతలు నోరుపారేసుకుంటే ఆ వ్యాఖ్యలకు మద్దతుగా వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆమెకు ఎన్‌టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు.
 

అమరావతి: NTR కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి(Laxmi Parvathi)పై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ఫైర్ అయ్యారు. ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన వారిపై నోరు మెదపకుండా.. చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)పై విమర్శలు చేయడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు. YCP నేతల అరాచకం, వికృత చేష్టల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసిన ప్రయత్నం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నదని మండిపడ్డారు. ఎన్‌టీఆర్ కుటుంబంపై అంత ప్రేమ ఉంటే.. ఆ మహానుభావుడి కుమార్తె గురించి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు మాట్లాడినవారిని వారించకుండా వెనకేసుకు రావడం దుర్మార్గమైన చర్య అని లక్ష్మీ పార్వతిపై ఫైర్ అయ్యారు. ఆమెకు ఎన్‌టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.

కుటుంబంలోని వ్యక్తిపైనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. ఆ వ్యాఖ్యలను సమర్థించడం, సమర్థనకు మీడియా ముందుకు రావడం సిగ్గు చేటు అని వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలు ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదని అనడం దారునమని అన్నారు. ఒకవేళ అంటే బాధపడతానని అంటున్నారే తప్పా.. ఖండించకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఇదేనా ఎన్‌టీఆర్ కుటుంబంపై ఆమెకు ఉన్న ప్రేమ అని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌టీఆర్ విగ్రహాలు కూల్చినప్పుడు నోరెత్తలేదని తెలిపారు. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు కనీసం నోరు కూడా ఎత్తలేదని వివరించారు. కుమార్తె భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు వికృత వ్యాఖ్యలు  చేస్తుంటే.. వికృత నవ్వులు నవ్విన జగన్ రెడ్డి ఆమెకు కనిపించ లేదా? అని నిలదీశారు. 

Also Read: చంద్రబాబు కంటతడి... ఇంకా మీ బావనే నమ్ముతున్నారా : నందమూరి ఫ్యామిలీపై లక్ష్మీపార్వతి ఫైర్

వికృత రాజకీయాలు చేస్తూ, మహిళల్ని కించపరిస్తుంటే చూస్తూ ఉండటానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వికటాట్టహాసం చేస్తూ జగన్ రెడ్డి విసిరే బిస్కెట్లకు కక్కుర్తిపడి చంద్రబాబుపై విమర్శలు చేయడానికి మీడియా మందుకు రావడానికి సిగ్గుచేటు అని ఆరోపణలు చేశారు. ఎన్‌టీఆర్ గారి సిద్ధాంతం కోసమే బతికిఉన్నానని లక్ష్మీ పార్వతి చెబుతూ ఉంటుందని, ఆ తెలుగు జాతికి అన్యాయం జరుగుతున్న మిన్నకుండి పోవడమేంటని ప్రశ్నించారు. తెలుగు ప్రజలను హింసిస్తున్న వైసీపీలో చేరడం చూసి ఎన్‌టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. 

Also Read: అసెంబ్లీలో జరిగింది బయటకు రానివ్వలేదు.. రికార్డులు మాయం చేశారు.. టీడీపీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణ

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ రాజకీయాలు చేశాడని, బాబాయి శవాన్నీ రాజకీయాలకు వాడుకున్నాడని, వేల కోట్ల ప్రజా సంపదను బొక్కేసిన వారికి లక్ష్మీ పార్వతి మాద్దతుగా మాట్లాడుతుండటం దారుణమని వివరించారు. అధికారం కోసం తల్లీ చెల్లిని రోడ్డుపైకి ఎక్కించాడని, అధికారం రాగానే పక్క రాష్ట్రానికి తరిమేశాడని జగన్‌పై విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తికి మద్దతునివ్వడంపై ఆక్షేపించారు. జగన్ రెడ్డి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలో పావుగా నిలిచి.. చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

click me!