
భీమవరం: యువతీ యువకుల ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడంతో తగువును పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువతి నుండి వివరాలు సేకరిస్తుండగా ఆమె ప్రియుడితో సీన్ లోకి ఎంటరైన లాయర్ ఎస్సైపై దాడికి దిగాడు. ఇలా డ్యూటీలో వున్న ఎస్సై కాలర్ పట్టుకుని లాయర్ దౌర్జన్యానికి దిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district)లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనుగొండ (penugonda)కు చెందిన వినోషా, ఇదే మండలంలోని కొనితివాడ గ్రామానికి చెందిన నమ్మి లోకేష్ ఒకరంటే ఒకరు ఇష్టపడి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వినోషా ప్రేమను అంగీకరించింది. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితం లోకేష్ కు ఆమె గుర్తచేసి పెళ్ళిచేసుకుందామని కోరింది. ఇందుకు అతడు కూడా పెళ్లికి అంగీకారం తెలిపాడు. ఇలా మాటిచ్చి రెండు నెలల గడుస్తున్న లోకేష్ నుండి ఉలుకూ పలుకూ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.
వినోషా ఫిర్యాదుతో ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ (penugonda police station) కు చేరింది. దీంతో పెనుగొండ ఎస్సై మోహనరావు యువతి నుండి వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా లోకేష్ కు సమాచారమిచ్చాడు. దీంతో లోకేష్ భీమవరం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పస్తుల సింహాచలంతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో ఎస్సై కాలర్ పట్టుకున్న లాయర్ సింహాచలం దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Video ప.గో జిల్లాలో కలకలం... పోలీస్ స్టేషన్ లోనే ఎస్సైపై లాయర్ దాడి
తమ అమ్మాయిని ప్రేమ పేరిట మోసంచేసిన లోకేష్ తో పాటు స్టేషన్ లోనే ఎస్సైపై దాడికి పాల్పడిన లాయర్ సింహాచలంను శిక్షించాలని డిమాండ్ చేస్తూ యువతి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. డ్యూటీలో వున్న పోలీస్ పై చేయిచేసుకున్న లాయర్ సింహాచలంపై రౌడి షీట్ ఓపెన్ చేయాలని కోరుతున్నారు ఇంతకాలం ప్రేమించి పెళ్ళిచేసుకునమనే సరికి వదిలించుకోవాలని చూస్తున్న ప్రియుడితోనే వినోషాకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదిలావుంటే గతేడాది ఏప్రిల్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పేకాట, కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారంతో వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన ఎస్సైని గ్రామస్తులు పరిగెత్తించి, చొక్కా లాగి కొట్టిన ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఎడవల్లిలో పేకాట, కోడి పందేలు ఆడుతున్న విషయం తెలిసి ధర్మాజీ గూడెం స్టేషన్ కుచెందిన ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడికి వెళ్లారు. స్థానికులు దుర్భాషలాడుతూ దాడికి యత్నించడంతో వారు ఏఎస్సై రాంబాబుకు సమాచారమిచ్చారు. దీంతో మరో కానిస్టేబుల్ తో కలిసి ఆ గ్రామానికి కొందరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులంతా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఎస్సై దుర్గా మహేశ్వరరావు కూడా అక్కడికి చేరుకున్నాడు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానికులు యూనిఫాంలో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ, చొక్కా లాగేసి మరీ కొట్టారు.