నేను, కూతురు మాత్రమే వుండగా... ఇంట్లోకి చొరబడిన పోలీసులు: కూన భార్య ఆందోళన

By Arun Kumar PFirst Published Apr 11, 2021, 11:55 AM IST
Highlights

తమ ఇంట్లో జరిగిన పోలీసుల సోదాపై శ్రీకాకుళం టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ భార్య ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో పరిషత్ ఎన్నికల సమయంలో అధికార వైసిపి నాయకులపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపధ్యంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన చిక్కలేదు. దీంతో  రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే తమ ఇంట్లో జరిగిన పోలీసుల సోదాపై  రవికుమార్ భార్య ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తాను, కూతురు మాత్రమే వున్న సమయంలో 80మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టినట్లు... దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సోదా చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరాచకాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు విని తమ ఇంట్లో సోదాలు చేశారని  ప్రమీల ఆరోపించారు. 

పరిషత్ ఎన్నికల రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మరుళీకృష్ణపై కూన రవి కుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కూన రవి కుమార్ అక్కడ ఉండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దానికితోడు కూన రవి కుమార్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, రవి కుమార్ ఆ సమయంలో ఇంట్లో లేరు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

 

click me!