
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా ఈ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలోని వనరుల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించడంతో పాటుగా.. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. భారత్ నుంచే కాకుండా విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కూడా ఏపీ ప్రభుత్వం ఈ సమ్మిట్‌కు ఆహ్వానించింది. దేశంలోని వివిధ నగరాల్లో రోడ్‌షోలను కూడా నిర్వహించింది. సీఎం జగన్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సుల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఏపీకి బిగ్ బ్రదర్‌గా అభివర్ణించారు. హైదరాబాద్ అభివృద్దిని చూసి చాలా గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ‘‘ఉత్తరాది దక్షిణాతో కలిసే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఇక్క జీవశాస్త్రం సాంకేతికతను కలుసుకుంటుంది. లైఫ్ సైన్స్‌లు డేటా సైన్స్‌ను వివాహం చేసుకుంటాయి. మా బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి చాలా గర్వపడుతున్నాం’’ అని అమర్‌నాథ్ చెప్పారు.
అయితే ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. విశాఖను తమ యంగర్ బ్రదర్ విశాఖ అని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న తమ యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి రాష్ట్రం ఏపీకి శుభాకాంక్షలు అని చెప్పారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని.. భారతదేశంలో అత్యుత్తమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.