13యేళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన భర్త.. పిల్లలు పుట్టిన సంగతీ పుట్టింటివారికి తెలియనివ్వకుండా దారుణం..

Published : Mar 02, 2023, 10:16 AM IST
13యేళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన భర్త.. పిల్లలు పుట్టిన సంగతీ పుట్టింటివారికి తెలియనివ్వకుండా దారుణం..

సారాంశం

ఓ భర్త తన భార్య పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. 13 యేళ్లపాటు ఇంట్లోనుంచి బయటికి రానివ్వలేదు. తల్లిదండ్రులను కలవనివ్వకుండా, పిల్లలు పుట్టిన సంగతి కూడా తెలియనివ్వకుండా చేశాడు. 

విజయనగరం : ఏపీలోని విజయనగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ భర్త తన భార్యను 13యేళ్లుగా ఇంట్లోని గదికే పరిమితం చేశాడు. విషయం ఎలాగో బయటికి పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో ఆ భార్యకు విముక్తి లభించింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి విజయనగరం వన్ టౌన్ సీఐ వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మధుబాబు అనే వ్యక్తి న్యాయవాది. అతను 2008లో పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన హేమలత, జనార్దన్ దంపతుల కుమార్తె సాయి సుప్రియను వివాహం చేసుకున్నాడు. 

ఆ తర్వాత 2009లో ఆమె గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. కుమార్తె పుట్టిన తర్వాత సుప్రియ అత్తగారింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమెకు తన కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవు. ఫోన్లో కూడా మాట్లాడనీయకపోయేవారు. మొదట కూతురు పుట్టిన తర్వాత, ఆమెకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు.  ఆ విషయం కూడా పుట్టింటి వారికి తెలియనివ్వలేదు. కూతురు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. తల్లిదండ్రులు సాయి సుప్రియను చూసేందుకు వచ్చినా కూడా మధుబాబు చూడనివ్వకుండా అడ్డుకునేవాడు. అంతేకాదు ఆమెను ఇంట్లోనుంచి కాలు బయటపెట్టనివ్వకపోయేవాడు.

ఛీ.. ఫస్ట్ నైట్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త.. అరెస్ట్...

అలా ఏళ్లు గడిచిపోతుండడంతో కుమార్తె మీద బెంగతో తండ్రి జనార్దన్ మంచం పట్టారు. దీంతో తల్లి తన కుమార్తె విషయాన్ని ఎలాగైన తేల్చుకోవాలనుకుంది. గత నెల 27న ఏపీలో జరిగిన స్పందన కార్యక్రమంలో సుప్రియ తల్లి హేమలత ఈ విషయాన్ని  ఎస్పీ దీపిక ఏం పాటిల్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మీద ఆశ్చర్యం వ్యక్తం చేసిన దీపిక వెంటనే వన్ టౌన్ పోలీసులకు విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం పోలీసులు మధుబాబు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. మధుబాబు  న్యాయవాది కావడంతో..  తమ ఇంటికి రావడానికి  కోర్టు ఆర్డర్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి వచ్చారు.  

ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం సెర్చ్ వారెంట్ తో మధుబాబు ఇంటికి వెళ్లారు. వెళ్లిన వారిలో  మహిళా పోలీసులు, సీఐ బి వెంకటరావు, ఎస్ఐలు, వీఆర్వో, స్థానికులు ఉన్నారు. వీరంతా సెర్చ్ వారెంట్తో వెళ్లి మధుబాబును తలుపులు తీయాలని ఎన్నిసార్లు అడిగినా ఇంటి తలుపులు తీయలేదు. దీంతో పోలీసులు  బలవంతంగా ఇంట్లోకి వెళ్లారు. మధుబాబు భార్య సుప్రియను తమ వెంట పంపించాలని పోలీసులు మధుబాబుకు చెప్పిన.. అతను ససేమిరా అన్నాడు. 

దీంతో సుప్రియను బలవంతంగా తీసుకువచ్చి న్యాయమూర్తి  ఎదుట హాజరపరిచారు. ఈ కేసును వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి రమ్య.. ప్రస్తుతానికి సుప్రియను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. గురువారం రెండు కుటుంబాలను న్యాయస్థానం న్యాయ సేవాధికార సంస్థ ముందు హాజరయ్యేలా చూడాలని తీర్పునిచ్చారు.  ఈ మేరకు వన్ టౌన్ సి ఐబి వెంకటరావు వివరాలు తెలియజేశారు.

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu