బెజవాడ దుర్గగుడిలో అనూహ్య పరిణామాలు.. ఈవోగా కేఎస్ రామారావు , తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం

By Siva Kodati  |  First Published Oct 8, 2023, 5:05 PM IST

విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది . తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్‌ను ఈవోగా నియమించింది.


విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తక్షణమే విధులు స్వీకరించాలని సర్కార్ ఆయనను ఆదేశించింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్నారు రామారావు. అయితే తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్‌ను ఈవోగా నియమించింది. అయితే రోజులు గడుస్తున్నా ఆయన విధుల్లో చేరకపోవడంతో రామారావును ఈవోగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే సరిగ్గా శరన్నవరాత్రులకు కొద్దిరోజుల ముందు ఈవో భ్రమరాంబ బదిలీ వ్యవహారం విజయవాడతో పాటు దేవాదాయ శాఖలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ బదిలీ వెనుక రాజకీయ కోణం వున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

Latest Videos

ALso Read: విజయవాడ దుర్గగుడి ఈవోపై బదిలీ వేటు.. దసరా ఉత్సవాలకు ముందు కీలక పరిణామం

ఇకపోతే.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్లో ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఉత్సవాలు జరిగే పది రోజుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరికొంతమంది సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు రాంబాబు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 

ఏ రోజున ఏ అలంకారం అంటే :

అక్టోబర్‌ 15 - బాలా త్రిపురసుందరి
అక్టోబరు 16 - గాయత్రీ దేవి
అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి
అక్టోబరు 18 - మహాలక్ష్మి 
అక్టోబరు 19 - మహాచండీ
అక్టోబరు 20 - సరస్వతి
అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి
అక్టోబరు 22 - దుర్గాదేవి
అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి

click me!