తెలంగాణ అభ్యంతరం.. జలశక్తి మంత్రి ఆదేశాలు: రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్న కేఆర్ఎంబీ

By Siva KodatiFirst Published Jun 29, 2021, 5:30 PM IST
Highlights

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించతలపెట్టిన ప్రాంతాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సందర్శించనుంది. ఇప్పటికే ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై మొన్న సీఎం కేసీఆర్ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించతలపెట్టిన ప్రాంతాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సందర్శించనుంది. ఇప్పటికే ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై మొన్న సీఎం కేసీఆర్ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్ట్‌లతో తెలంగాణ నష్టపోతుందని వివరించారు. దీనిపై స్పందించిన జలశక్తి మంత్రి కేఆర్ఎంబీని ఆదేశించారు. ఈ పనులను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జలశక్తి మంత్రి సూచించారు.

దాంతో హరికేశ్ మీనా ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీ పనులను పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. శ్రీశైలం జలాలను వాడుకునేందుకు రూ.307 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. సంగమేశ్వరం వద్ద పంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి 17.6 కిలోమీటర్ల కాలువ తవ్వి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద శ్రీశైలం కుడికాలువకు కలుపుతారు.

Also Read:రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ స్పీడుకు కేంద్రం బ్రేకులు.. అనుమతుల ప్రక్రియ నిలిపివేత

అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్ఆర్‌బీసీ, గాలేరు నగరి ప్రాజెక్ట్‌లకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం శ్రీశైలం కుడి ఒడ్డు కాలువ సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులు. దీనిని 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు కాలువను వెడల్పు చేయాల్సి వుంటుంది. 30 నెలల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. మరోవైపు తమకు కేటాయించిన కృష్ణా జలాలను ఏపీ వాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం వుంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీరు అందుతుంది.

ఆ నీటి మట్టం తక్కువ కాలం వుంటుంది. దీంతో ఏపీకి కేటాయించిన నీరు పూర్తి స్థాయిలో దక్కడం లేదు. ఎక్కువ రోజులు వరద వచ్చిన సందర్భాల్లోనే గరిష్టంగా వంద టీఎంసీలకు పైగా ఏపీ వినియోగించుకున్న సందర్భాలు వున్నాయి. సగటు వర్షపాతం నమోదైనప్పుడు 650 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా వున్నప్పుడు రోజుకు 1150 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిన సందర్భాలు వున్నాయి. ఈ పరిస్థితుల్లో వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించింది. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోసే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. 

click me!