అనపర్తి ఎఫెక్ట్‌తో జగన్‌కు ఉలికిపాటు.. అందుకే గన్నవరంలో విధ్వంసం : వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఆరోపణలు

Siva Kodati |  
Published : Feb 22, 2023, 06:23 PM IST
అనపర్తి ఎఫెక్ట్‌తో జగన్‌కు ఉలికిపాటు.. అందుకే గన్నవరంలో విధ్వంసం : వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఆరోపణలు

సారాంశం

రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను , అధికారులను జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను , అధికారులను జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. 

ఆ లేఖ యథాతధంగా.. 
‘‘ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే... ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ. గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీనేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారిఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్ కు గురిచేసి....ఆ బాధితులనే నిందితులుగా మార్చి, జైలుకు పంపిన వైనంపై వాస్తవాలు మీ దృష్టికి తేవడానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. 

అరాచక పాలనతో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్నఆస్తులను కబ్జా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు...బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారింది. పన్నుల పై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారింది. కోవిడ్ సమయంలో మాస్క్ లు అడిగిన డాక్టర్ సుధాకర్...మద్యం పై ప్రశ్నించిన ఓం ప్రతాప్ ల ప్రాణాలు తీశారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారు. ఇలాంటి ఘటనలు ఈ పాలనలో కోకొల్లలు. 

ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి నేను చేపట్టిన పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇటీవల జగ్గంపేట, పెద్దాపురంలో మా పర్యటనల అనంతరం...ప్రజా స్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం...అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించింది. సభకు ముందగా అనుమతులు ఇచ్చిన పోలీసులు ప్రభుత్వ ఒతిడితో అడ్డంకులు సృష్టించారు అయితే నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేసిన దండి మార్చ్ స్పూర్తితో...నేను 7 కిలోమీటర్లు నడిచి అనపర్తి మార్చ్ నిర్వహించాను. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ...ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగిన అనపర్తి సభ విజయవంతం అయ్యింది. దీంతో సిఎం ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యిమందిపై అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. ఆంక్షలు, నిర్భందాలు ఉన్నా అద్భుతంగా జరిగిన సభతో ఉలిక్కిపడిన జగన్... గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపాడు. హింసాత్మక ఘటనలతో ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కక పోతే ఇక లాభం లేదని భావించి.... గన్నవరం విధ్వంసాని పాల్పడ్డాడు.
    
ప్రజల తరుపున గళం వినిపిస్తున్న బడుగు బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరం హింసకు పాల్పడ్డారు. ఈ నెల 20వ తారీఖున గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు ప్రణాళికా బద్దంగా తెలుగుదేశం నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ది స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దొంతు చిన్నాకు ఫోన్ చేసి మా నేతనే విమర్శిస్తావా అంటూ బెదిరించారు. 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు వైసీపీ గూండాలు దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. చిన్నా ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ సమయంలో బాధితులు పోలీసు సాయం అర్ధించినా వారు స్పందించలేదు. దీంతో అదే రోజు సాయంత్రం నియోజకవర్గ నేతల సహకారంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిన్నా సతీమణి రాణి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. 

టీడీపీ నేతలంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో...వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వైసీపీ రౌడీ మూకలు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. కార్లు, ఇతర వాహనాలు తగలబెట్టారు. కార్యకర్తలు, నేతలపై దాడులుచేశారు. ఈ సమయంలో పార్టీ  కార్యకర్తలు ఆత్మరక్షణ, ఆస్తులు రక్షణకు అక్కడికి వచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే పోలీసులు జులుం ప్రదర్శించారు. ఘటనపై నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలపై రెండో సారి కూడా వైసీపీ గూండాలు పోలీసుల ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. మళ్లీ రాత్రి 8 గంటలకు దొంతు చిన్నా ఇంటికి వెళ్లి అతని వాహనాన్ని దహనం చేశారు. ఒక్క రోజు వ్యవధిలో బిసి నాయకుని ఇంటిపై ఈ స్థాయి దాడి జరగడం బలహీన వర్గాలకు రక్షణ లేదన్న విషయం స్పష్టం చేస్తోంది.

ఇలా రోజంతా యదేఛ్చగా విధ్వంసం జరుగుతున్నా...ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మా నేతలు జిల్లా ఎస్పికీ ఫోన్ చేసినా స్పందించలేదు. కనీసం అదనపు బలగాలు తెచ్చి పరిస్థితిని చక్కదిద్దలేదు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్ లలో రికార్డు అయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైసీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైరవిహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించలేదు. 

పోలీసులు దాడిలో బాధితులైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఈ క్రమంలో కొత్త తరహా విష సంస్కృతికి జగన్ శ్రీకారం చుట్టాడు. శాంతి భద్రతలు పరిక్షించాల్సిన పోలీసుల చేతనే తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి పావులుగా వాడుకున్నాడు. పోలీసు వ్యవస్థను, పోలీసు అధికారులను తమ రాజకీయ అవసరాలకు వాడుకుని వారినీ బలిపశువులు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగస్వాములు కావొద్దని పోలీసులకు విజ్ఫప్తి చేస్తున్నాను.

ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారు. మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా మార్చి, మార్చి పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న టీడీపీ నేతలను జైలుకు పంపాలి అనే ఏకైక ఉద్దేశ్యంతో....టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు జైలు పాలు చేశారు. ఈ సందర్భంలోనే పార్టీనేతలపై పోలీస్ టార్చర్ ప్రయోగించారు. ఎస్సి,ఎస్టి చట్టం కింద వ్యక్తి గతంగా కేసు పెట్టేందుకు అర్హత లేకపోయినా.... క్రిస్టియన్ అయిన గన్నవరం సిఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం అవుతుంది.

గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా....ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ది స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నాడు. ప్రజల నుంచి రూ. 1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో ఇతను నిందతుడు. ఈ మొత్తం ఘటనలో దాడులకు గురయ్యింది తెలుగుదేశం కార్యకర్తలు, ధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తగలబడిన కార్లు తెలుగుదేశం నేతలవి, బెదిరించి, భయభ్రాంతులను చేసింది తెలుగుదేశం నేతలనే, పోలీస్ టార్చర్ అనుభవించింది తెలుగుదేశం వారే, బాధితులూ తెలుగు దేశం వాళ్లే... కానీ పోలీసులు తప్పుడు ఆరోణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్లనే.  

నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శనమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డా॥ బి.ఆర్. అంబేద్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నది. దీనిలో కొంత మంది కళంకిత పోలీసు అధికారులు భాగస్వాములు కావడం విచారకరం. ఈ తరహా దాడులు, విధ్వంసాలతో ఈ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. తద్వారా తమను ఎవరూ ఎదిరించ కూడదనే భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది వారి కుట్ర. 

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గాని, కార్యకర్తలు గాని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు గాని వీటికి భయపడే పరిస్థితి ఉండదు. 40 ఏళ్లుగా పార్టీని ఆదరించిన ప్రజలను కాపాడుకోవడం కోసం, బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరిచి...ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడ నుంచి కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నాను.  ఇందుకోసం ఏ స్ధాయి పోరాటానికి అయినా నేను సిద్దంగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి... ప్రజాస్వామ్యానికి, నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే. ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందాం. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం. మన భవిష్యత్ ని... మన బిడ్డల భవిష్యత్ ని కాపాడుకుందాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.  
 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu