AP News: కొడాలి నాని మరో డేరా బాబా... గుడివాడలో అసాంఘిక కార్యకలాపాలు: బుద్దా వెంకన్న

Arun Kumar P   | Asianet News
Published : Apr 22, 2022, 12:27 PM ISTUpdated : Apr 22, 2022, 12:29 PM IST
AP News: కొడాలి నాని మరో డేరా బాబా... గుడివాడలో అసాంఘిక కార్యకలాపాలు: బుద్దా వెంకన్న

సారాంశం

గుడివాడలో ఓ నియంతలా వ్యహరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన మాజీ మంత్రి కొడాలి నాని మరో డేరా బాబా అంటూ టిడిపి నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 

గుడివాడ: అక్రమంగా మట్టితవ్వకాలు జరుపుతుంటే అడ్డుకోడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారిపై జేసిబితో దాడిచేసిన ఘటన కృష్ణా జిల్లాలో గుడివాడలో కలకలం రేపింది.  అధికార వైసిపి నాయకుల అండదండలతోనే ఆర్ఐపై మట్టిమాఫియా దాడి చేసినట్లు ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) కనుసన్నల్లోని గుడివాడలో అన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని టిడిపి నేత బుద్దా వెంకన్న (budda venkanna) ఆరోపించారు. రెవిన్యూ ఉద్యోగి పై గడ్డం గ్యాంగ్ దాడిని టీడీపీ ఖండిస్తోందని... ఉద్యోగ సంఘాలకు టీడీపీ అండగా ఉంటుందని వెంకన్న తెలిపారు. 

గుడివాడలో కొడాలి నాని అనుచరులు రెవిన్యూ ఉద్యోగి పై దాడి చేయడం దారుణమని బుద్దా వెంకన్న అన్నారు. మాజీ మంత్రి నాని గుడివాడలో ఒక నియంతలా, ఓ డేరా బాబాలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. గతంలో పేకాట క్లబ్ లు పెట్టి గుడివాడకే చెడ్డపేరు తెచ్చారని అన్నారు. ఈ పేకాట శిబిరాలపై స్థానిక పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదని... చివరకు బయట్నుంచి పోలీసులు తెప్పించాల్సి వచ్చిందని వెంకన్న పేర్కొన్నారు. 

''రాత్రి సమయంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి వెళ్ళిన రెవిన్యూ అధికారిపై నాని అనుచరులు దాడి చేస్తే కేవలం ఒకేఒక కానిస్టేబుల్ ను ఘటనాస్థలికి పంపించారు. ఇది చాలు గుడివాడలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని చెప్పడానికి. స్థానిక పోలీసులకు మాముల్లు ఇస్తూ ఆ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మాజీ మంత్రి నాని" అని బుద్దా ఆరోపించారు. 

''గుడివాడలో నాని ఆధ్వర్యంలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ఇలాంటి నాయకులపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొడాలి నాని అంటే ముఖ్యమంత్రి జగన్ కు  కూడా భయమా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది'' అన్నారు. 

''సీఎం జగన్ పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి రక్షణ లేకుండా పోయింది. గుడివాడ పక్క నియోజకవర్గంలో కూడా మట్టి మాఫియాతో కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రతీ దాంట్లో కమిషన్ కొట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారు. గుడివాడలో జరిగిన కుంభకోణాల మీద వెంటనే ఓ కమిషన్ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి.నాని, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని వెంకన్న డిమాండ్ చేసారు.

''వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. అధికార వైసిపి నాయకులు అక్రమాలకు పాల్పడుతూ అడ్డుకునే అధికారులపై దాడులకు దిగుతున్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాలన్నీ ఏకం కావాలి... ఉద్యోగులంతా పెన్ డౌన్ చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి మీ రక్షణకు చర్యలు చేపడుతుంది'' అని బుద్దా వెంకన్న సూచించారు. 

ఇక ఇప్పటికే గుడివాడలో ఆర్ఐ పై దాడి ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. మ‌ట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌పై జేసీబీతో దాడిచేసిన గ‌డ్డంగ్యాంగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు. అలాగే వైసీపీ నేత‌ల దాడుల నుండి ప్ర‌భుత్వ సిబ్బంది, అధికారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలని కోరారు. 

ఇదిలావుంటే ఇప్పటికే ఆర్ఐ పై దాడికి పాల్పడింది మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ సోదరుడు కళ్యాణ్‌ గా గుర్తించారు. అధికార పార్టీ, కొడాలి నాని అండతో అతడు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ ధైర్యంతోనే ఆర్ఐపై కూడా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!