మహిళా దినోత్సవం రోజున అమరావతి మహిళలను వేధించిన జగన్ యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని శ్వేత డిమాండ్ చేశారు.
విజయవాడ: పూజించాల్సిన మహిళల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే లాఠీలతో వేధించడం సిగ్గుచేటని విజయవాడ నగర టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మండిపడ్డారు. ఇలా అమరావతి మహిళలను వేధించిన జగన్ యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని శ్వేత డిమాండ్ చేశారు.
''ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకున్న మన దేశంలో మహిళా దినోత్సవం నాడే అమరావతి మహిళా రైతులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం అమానుషం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి'' అని డిమాండ్ చేశారు.
undefined
read more మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు
''మహిళలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రకాశం బ్యారేజీపై జరిగిన దాడితో బట్టబయలైంది. మహిళల కన్నీరుకు కారణమైన జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న అమరావతి మహిళలను అడ్డుకుని దాడికి పాల్పడిన జగన్ రెడ్డి... మహిళల గురించి మాట్లాడే అర్హతే లేదు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి మహిళలపై భౌతిక దాడికి పాల్పడితే హోంమంత్రిగా ఉన్న మహిళ చేతులు కట్టుకుని కూర్చున్నందుకు సిగ్గుపడాలి'' అన్నారు.
''మహిళల్ని, రైతుల్ని కన్నీరు పెట్టించిన ఏ పాలకుడూ బాగుపడిన చరిత్ర లేదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. దాడికి పాల్పడిన వారిపై డీజీపీ సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా అదుపులోకి తీసుకున్న మహిళా రైతులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి'' అని శ్వేత డిమాండ్ చేశారు.