పిట్టల దొర చేతిలో తుపాకిలా దిశా చట్టం..: మాజీ మంత్రి జవహర్ సెటైర్

By Arun Kumar PFirst Published Mar 8, 2021, 12:19 PM IST
Highlights

జగన్ సర్కార్ తీసుకువచ్చిన దిశా చట్టం పిట్టల దొర చేతిలో తుపాకి అయిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు. 
 

అమరావతి: దిశ లేని పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు. గన్ కన్నా ముందొస్తానన్న జగన్ ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన దిశా చట్టం పిట్టల దొర చేతిలో తుపాకి అయిందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. 

''మహిళకు రక్షణ లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. పులివెందుల దళిత మహిళపై అత్యాచార సంఘటనే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా వుందో తెలియజేస్తుంది. మహిళా దినోత్సవం చేసే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. రక్షణ కల్పించలేని ప్రభుత్వం ముందుగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. తల్లి, చెల్లి, బిడ్డల సాక్షిగా వైఫల్యాన్ని ఒప్పుకోవాలి'' అని జవహర్ డిమాండ్ చేశారు. 

read more  టిడిపి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి అరెస్ట్... టిటిడి మాజీ ఛైర్మన్ పైనా కేసు

ఇక మహిళా దినోత్సవం సందర్బంగా చంద్రబాబు కూడా ఏపీలో మహిళా రక్షణపై సోషల్ మీడియా వేదికన స్పందించారు. ''ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ మహిళల పై దేశం మొత్తం మీద జరిగే నేరాలలో మూడో వంతు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయని నివేదికలు చెబుతుంటే బాధేస్తోంది. "యథా రాజా తథా ప్రజా" అన్నారు. పాలకుల తీరే అలా ఉంది. ఇక మీదటయినా పరిస్థితి మారాలని ఆశిద్దాం'' అంటూ ట్వీట్ చేశారు. 

''సకల రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ సమానత్వం, సాధికారతలే మన సమాజ ప్రగతికి మూలమని తెలుగుదేశం ఆవిర్భావ దినం నుంచీ నమ్ముతున్న సిద్ధాంతం'' అంటూ చంద్రబాబు మరో ట్వీట్ చేశారు. 
 

click me!