
నోరు జారితే ఎన్నికష్టాలు వస్తాయో అనుభవపూర్వకంగా తెలిసివస్తోంది స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో తాను పోటీ చేసినపుడు రూ. 11 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చిందని స్వయంగా ఆయనే చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావంపై మాట్లాడుతూ యధాలాపంగా స్పీకర్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ అది ఇపుడు ఆయన మొడకే చుట్టుకుంటోంది. కోడెల వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తాను చేసిన వ్యయాన్ని కోడెలే స్వయంగా చెప్పారు కాబట్టి ఆయనను ఎంఎల్ఏగా అనర్హుడిని చేయాలంటూ పిటీషన్ లో కోరారు. పిటీషనర్ ఫిర్యాదును పరిశీలించిన హై కోర్టు కోడెలపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. దాంతో స్పెషల్ మొబైల్ పిసిఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసారు. ఏప్రిల్ 20వ తేదీన కరీంనగర్ కోర్టుకు హాజరవ్వాలంటూ కోడెలకు సమన్లు జారీ చేసారు.