
చంద్రబాబునాయుడు ముందు నరేంద్రమోడి ఏ విషయంలో కూడా సరిపోడట. బికాంలో ఫిజిక్స్ చదివిన వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ స్వయంగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో జలీల్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఎవరికీ రాని ఐడియాలు వస్తాయట. నిజమే. పచ్చని పంట పొలాలను నాశనం చేసి రాజధాని కట్టాలన్న ఐడియా చంద్రబాబుకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఏడాదికి మూడు పంటలు పండే భూములను చంద్రబాబు నాశనం చేసేస్తున్నట్లు అందరూ గోలపెడుతుంటే, జలీల్ ఏమో చంద్రబాబు అడవిలో అసెంబ్లీ కట్టారని కొత్తగా చెప్పారు.
పనిలో పనిగా తనకు ఎన్నికలంటే ఏమాత్రం భయం లేదన్నారు. ఎప్పుడు పోటీ చేసినా గెలుపు ఖాయమట. పవన్ కల్యాణ్ పై పోటీ చేసినా సరే 10 ఓట్ల తేడాతోనైనా తనదే గెలుపట. తమకు భాజపాతో ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. భాజపాతో రాజకీయావసరాలు కూడా ఏం లేవని కుండబద్దలు కొట్టేసారు. ఈ మాట చంద్రబాబును చెప్పమనండి. తనకు మంత్రి పదవి వస్తుందో రాదో కూడా తెలీదంటూనే ఇపుడున్న పరిస్ధితిల్లో మంత్రిపదవి కన్నా ఎంఎల్ఏనే మంచిదన్నారు. అంతేలేండి బికాంలో ఫిజిక్స్ చదవగలిగిన మేధావులు మంత్రివర్గంలో లేకపోవటమే రాష్ట్రానికి మేలు.