వ్యవసాయ కూలీ మృతి... మంత్రి పెద్దిరెడ్డి క్వారీలో పేలుడువల్లేనంటూ ప్రచారం: గనులశాఖ క్లారిటీ

By Arun Kumar PFirst Published May 30, 2021, 9:40 AM IST
Highlights

కడియాలకుంటలోని క్వారీలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గనులు మరియు భూగర్భశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంటలోని క్వారీలో పేలుడు సంభవించి, ఒకరు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గనులు మరియు భూగర్భశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన క్వారీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినట్లు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో మంత్రి గారి పేరుతో ఎటువంటి క్వారీలు లేవని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. 

ఈ పేలుడు ఘటనపై చిత్తూరు జిల్లాకు చెందిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌లు సంఘటనా స్థలంను సందర్శించారని, దీనిపై విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేలుడు వల్ల మృతి చెందిన వ్యక్తికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేస్తామని వెంకటరెడ్డి తెలిపారు.

read more  ఏపీ: గనుల శాఖ మంత్రి క్వారీ నుంచి దూసుకొచ్చిన రాయి... మామిడి కూలీ మృతి

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... క‌డియాలకుంట గ్రామంలోని పీఎల్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ కంక‌ర రాళ్లలో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్వారీ నుంచి దూసుకొచ్చిన రాయి త‌గ‌ల‌డంతో ఓ వ్య‌వ‌సాయ కూలీ చ‌నిపోయాడు. ఈ క్వారీకి స‌మీపంలోని తోట‌లో మామిడి కాయ‌లు కోసేందుకు కొందరు కూలీలొచ్చారు. వీరు మామిడితోట‌లో కాయ దింపుతుండగా క్వారీలో పేలుడు జ‌రుగుతుంద‌ని నిర్వాహకులు వీరికి స‌మాచారం ఇచ్చారు.

దీంతో కూలీలు ట్రాక్ట‌ర్‌లో బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలోనే క్వారీలో పేలుడు జ‌రిగి ఓ రాయి వేగంగా దూసుకు వ‌చ్చింది. అది జహీర్ అనే కూలీకి బ‌లంగా త‌గ‌ల‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైనే గనుల శాఖ విచారణ జరిపింది.


 

click me!