
చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన ట్వీట్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. పౌర హక్కులను, పౌరుల భావప్రచటనా స్వేచ్చను కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ కట్జూ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసారు. తర్వాత ప్రభుత్వం రద్దుపై ట్విట్టర్లో పోలింగ్ కూడా నిర్వహించారు. ఏ విషయంపైన కూడా కట్జూ ట్విట్టర్లో పోలింగ్ నిర్వహించటం ఇదే మొదటిసారట. అయితే, ఆ పోలింగ్ కు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన రావటం గమనార్హం.
చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న కట్జూకు అనుకూలంగా 67 శాతం ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 33 శాతం ఓట్లు పడ్డాయి. ప్రభుత్వం రద్దుకు అనుకూలంగా 1910 ఓట్లు వచ్చినట్లు కట్జూ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలావుండగా, కట్జూ అభిప్రాయానికి మద్దతుగా నెటిజన్లు కూడా సొంతంగా ఓ పోలింగ్ నిర్వహించాలనుకుంటున్నారు. అందుకు మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సేకరించిన నెటిజన్ల అభిప్రాయాలను పంపాలని కూడా అనుకుంటున్నారు. మొత్తంమీద చంద్రబాబు సర్కార్ పై నెటిజన్ల యుద్ధం మొదలైనట్లే కనబడుతోంది.