
రాష్ట్రం మొత్తం మీద కృష్ణా-గుంటూరు జిల్లాలు ప్రశాంతమైనవని చంద్రబాబునాయుడు చెబుతుంటారు. అందుకే రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పగా చెప్పారు. కానీ జరుగుతున్నదేమిటి?
రాజధాని ప్రాంతమైన దగ్గర నుండి విజయవాడ అరాచకాలకు నిలయమైపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలు పెరిగిపోతున్నాయ్. రాజధాని ప్రాంతమవ్వటంతో ప్రశాంతంగా ఉండే విజయవాడపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో పాటు నేరాలూ పెరిగిపోతున్నాయ్. ఇటు కృష్ణా అటు గుంటూరు జిల్లాలో చంద్రబాబునాయుడు సామాజిక వర్గంకు చెందిన నేతలదే పెత్తనమవటంతో ఇక వారి అధికారాలకు హద్దే లేకుండా పోతోంది. ఎప్పుడైతే కొందరికి అపరమితమైన అధికారాలు వచ్చాయో ఏం చేసినా అడిగేవారే లేరన్న ధైర్యం కూడా తోడవ్వటంతో కొందరు నేతల దురాగతాలకు హద్దే లేకుండా పోతోంది.
గడచిన మూడేళ్ళల్లో పై రెండు జిల్లాల్లో బయటపడుతున్న నేరాలే ఇందుకు ఉదాహరణ. తాజాగా బయటపడ్డ హవాల వ్యవహారం కూడా అందులో భాగమే. విజయవాడ ప్రాంతంలో ఏ నేరం బయటపడినా దాని వెనకాల అధికార పార్టీ నేతల హస్తం ఉండటం వల్ల పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. హవాలా వ్యవహారంలో ఒక వ్యాపారస్తుడిని ఏకంగా డాక్టర్లే కిడ్నాప్ చేయటం, వారికి వత్తాసుగా ఇద్దరు పోలీసు అధికారులు కూడా తోడవ్వటం ఇపుడు విజయవాడలో సంచలనంగా మారింది.
సరే, పోలీసు అధికారులపై ఏదో మొక్కుబడి చర్యలు తీసుకున్నారు. మరి, డాక్టర్లపై ఏం చర్యలు తీసుకుంటారన్నదే పెద్ద ప్రశ్న. సహజంగా ఏమైనా సమస్యలు వస్తే బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారు. అంతేకానీ ఏకంగా వారే కిడ్నాప్ కు పాల్పడిన ఘటనలు గతంలో లేవు. ఇపుడు తాజాగా కిడ్నాపులకు కూడా దిగుతున్నారంటే వారి వెనుకున్న రాజకీయ మద్దతే కారణమని అర్ధమవుతోంది.
గతంలో ‘కాల్ మనీ సెక్స్ రాకెట్’ లో ఉన్న కొందరు పెద్దలే ఇపుడు హవాలా రాకెట్ వ్యవహారంలో కూడా ఉన్నారన్న ప్రచారం మొదలైంది. అప్పట్లో కాల్ మనీ కేసు కూడా నీరుగారిపోయింది కదా? కాబట్టి ఈ కేసులో కూడా డాక్టర్లకు ఏం కాదన్న ప్రచారం మొదలైంది. అప్పట్లో రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసిన సెక్స్ కుంభకోణంలోనే పోలీసులు నిందుతులను ఏం చేయలేకపోయారు. దాంతో రాజకీయ మద్దతున్న వారందరికీ బాగా ధైర్యమొచ్చినట్లుంది. డాక్టర్లను మోసం చేసాడని ఆరోపణలెదుర్కొంటున్న ఫైనాన్షియర్ బ్రాహ్మాజీ ప్రస్తుతం తీవ్ర దెబ్బలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా సంచలనం సృష్టిస్తున్న హవాలా కేసును పోలీసులు ఏ విధంగా కేసును డీల్ చేస్తారో చూడాలి.