
2014కు ముందు కేంద్రంలో అవినీతి ప్రభుత్వం వుండేదన్నారు బీజేపీ (bjp) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) . రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ గోదావరి గర్జన సభలో (bjp godavari garjana) ఆయన మాట్లాడుతూ.. మోడీ (narendra modi) హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. మోడీ దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని... అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అన్నదే లేకుండాపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, ఇప్పటికే ఇవి రూ.8 లక్షల కోట్లను దాటిపోయాయని నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం విడుదల అవుతున్న నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కు వెళ్లాయంటూ నడ్డా ధ్వజమెత్తారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు కరవయ్యాయని చురకలు వేశారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.