కనిపించి కన్నీరొలికించే ఆలయం...

First Published Feb 12, 2017, 5:05 AM IST
Highlights

ఇదొక బాధించే నిజం.  ఆలయం ఎపుడు తేలుతుందా అని జనం ఎదురుచూస్తే, ఎపుడు మునుగుతుందా అని రైతులు  కార్తెలను లెక్కిస్తూ ఉంటారు

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టి కృష్ణాజిల్లా లోని హంసలదీవి దగ్గర సాగరసంగమం జరిగే కృష్ణవేణీ నది మార్గంలో ఎన్నెన్నో అపురూప ఆలయాలు.ఈ నది ప్రతి మలుపు దగ్గరా ఒక ఆలయం.ఇక ఉపనదులు కలిసే కొన్ని సంగమప్రదేశాలను సంగమేశ్వరంగా వ్యవహరిస్తారు.కర్నాటకలో బాదామి చాళుక్యుల తొలిరాజధాని ఐహోళె సమీపంలో ఘటప్రభ,మలప్రభల నదులు సంగమించే ప్రదేశాన్ని కూడలి సంగమ అంటారు.ఇక్కడ చాళుక్యుల కాలం నాటి ఆలయంతో పాటూ వీరశైవ మతస్థాపకుడు,సంఘసంస్కర్త బసవన్న సమాధి మందిరమూ ఉంది.

 

దక్షిణాదిలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన రాజ్యం చాళుక్యులది.వీరికాలం నాటికి బౌద్ధ,జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నా వీరు మాత్రం వైదిక మతావలంబులు.వీరి తొలిరాజధాని ఐహోళె,పట్టాభిషేకాలు జరుపుకున్న పట్టాడకల్ లలో ఎన్నో అపురూప ఆలయాలను,బాదామిలో గుహాలయాలను నిర్మించారు.ఆ తర్వాత రాజ్యవిస్తరణలో భాగంగా మొలకసీమ,ఏరువసీమ,రెండేరులసీమ గా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్,కర్నూల్ జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు.ఈసీమలో తుంగభద్ర,కృష్ణల సంగమ ప్రదేశమైన కూడలి,కూడవెల్లిగా వ్యవహరించే ప్రదేశంలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాల నమూనాతో కూడవెల్లి సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణానంతరం మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నా వరద సమయాల్లో గర్భాలయాల్లోకి ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతాన్ని అన్వేశించగా తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అలంపురం కనిపించింది.ఇది అదివరకే జోగుళాంబ శక్తి పీఠమైనందున,పరుశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమ ప్రాంతమైనందున ఇక్కడ నవబ్రహ్మాలయాలను నిర్మించారు.

 

కాలక్రమేణా చాళుక్యుల ప్రాభవం తగ్గింది.రాష్ట్రకూటుల ప్రాభవం హెచ్చింది.వీరికి పల్లవులతో సంబంధబాంధవ్యాలున్నందున చాళుక్యులను జయించారు.వీరూ ఆలయాలు నిర్మించాలనుకున్నారు.

 

నల్లమలలో భవనాశి అనే సెలయేరుగా పుట్టి కృష్ణలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు.ఈ సంగమానికి నివృత్తి సంగమం అని పేరు.పాపులను పునీతులుగా మారుస్తూ గంగా నదికి కాకి రూపం వచ్చిందని,ఆ రూపం పోగొట్టుకోవడానికి సంస్థ తీర్తాల్లో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ హంస రూపం పొందిందని కథనం.ఆవిడ పాప నివృత్తి అయినందున నివృత్తి సంగమేశ్వరంగా వ్యవహరించేవారు.ఇక్కడ నది ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంటుంది.పాండవులు అరణ్యవాస సమయాన ఇక్కడికి వచ్చారని.శివలింగం తేవడానికి భీమూన్ని కాశీకి పంపగా అతను ముహూర్త సమయానికి రానందున ధర్మరాజు ఒక వేపమొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని కథనం.తల మీద,రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం,అమరేశ్వరం,సిద్దేశ్వరం,కపిలేశ్వరం,సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం.

 

ఇక రాష్ట్రకూటులు ఈ ప్రదేశంలో చాళుక్య,పల్లవుల వాస్తు రీతులను మేళవించి ఆలయాలు నిర్మించారు.వీరి ఆలయం ఒక పెద్ద రాతిరధాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయాలున్న ప్రదేశంలో ధ్యానం చేస్తే రూపాయలు కురుస్తాయనే నమ్మకంతో దీన్ని రూపాల సంగమం అనేవారని ప్రజల్లో ఒక కథ ప్రచారంలో ఉంది.

 

కాలచక్ర గమనంలో రాజులు,రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి.మన తొలి ప్రధాని నెహ్రూ "ఆధునిక ఆలయాలు" గా అభివర్ణించిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు మొదలయ్యాయి.కృష్ణా నది మీద శ్రీశైలం లో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది.మహబూబ్ నగర్,కర్నూలు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి,ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

 

 క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో నాటి పాలకుడు రామ్‌సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి భవ్య ఆలయం నిర్మించాడు.దాన్ని అబు సింబెల్ ఆలయంగా వ్యవహరిస్తారు.1960 ల్లో అస్వాన్ హై డామ్ నిర్మాణంలో ఈ ఆలయం మునుగుతుందని అనేక దేశాలు,UNO సహకారంతో ఆ కొండను,శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో పునర్ణిర్మించారు.ఈ ఆలయ ప్రేరణతో పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయాలనూ ఊకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసారు.

 

కూడవెల్లి లోని ఆలయాన్ని అలంపురంలో నిర్మించగా...రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాన్ని కర్నూలు శివారులో ఉన్న జగన్నాధ గట్టు పైన పునర్ణిర్మించారు.ఇక పాత నివృత్తి సంగమేశ్వరంలో గొప్ప శిల్పసంపద లేనందున వదిలివేసారు.

 

ఈ నివృత్తి సంగమం నదిలోనే ఉండిపోయేది.కానీ 1996 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బాంక్ అప్పు కోసం G.O-69 తీసుకు వచ్చాడు.అంతదాకా 854 అడుగుల కనీస నీటిమట్టం ఉండాల్సిన శ్రీశైలం రిజర్వాయర్లోని నీళ్లను 836 అడుగులవరకు కిందున్న నాగార్జునసాగర్,కృష్ణా డేల్టా కు తరలించే ఏర్పాటు చేసాడు.(నీళ్లు దిగువకు వదులుతూ విద్యుదుత్పాదనను,డెల్టా లోని పంటలనూ బ్యాంక్ వారికి చూపాడు)...ఇక ప్రతి ఏటా ఈ ఆలయం నదీ గర్భం నుంచి బయట పడటం మొదలైంది.ఇలా 4,5 నెలలు వెలుపల ఉండి తుంగభద్ర,కృష్ణలకు వరదలొచ్చినప్పుడు తిరిగి నదీ గర్భంలోకి చేరేది.2015-16 లో సుమారు 8 నెలలు బయటే ఉండిపోయింది.

ఈ లోగా ఈ శిధిలాలయం మహిమ ప్రచారం చేస్తూ కొందరు దిగిపోయారు.ఆలయ సందర్శనకు యాత్రికుల తాకిడి మొదలైంది.ఈ ఆలయం బయట పడిందంటేనే రాయలసీమ కు కన్నీరొస్తుంది.కారణం రాయలసీమకు కృష్ణా జలాలను అందిచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల దగ్గర ఉంటుంది.ఇక ఆలయం బయట పడిందంటే బ్రహ్మాండమైన వరదలొస్తే తప్ప ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు చేరవు.కానీ ఆ విషయం విస్మరించిన జనం ఆలయసందర్శనకు వెళుతూనే ఉంటారు.రైతులు మాత్రం ఎప్పుడు ఈ ఆలయం మునుగుతుందా అని ఆలోచిస్తూ కార్తెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.

 

పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నామనే కబుర్లు కాదు...చిత్తశుద్ది ఉండి నిజంగా రాయలసీమకు నీళ్లు పారాలంటే ఈ కనీసనీటి మట్టాన్ని 854 కు పెంచాలని,ఆ పట్టిసీమ వల్ల మిగులుతున్నాయని చెప్పే 45 టి.యం.సి నీళ్లు రాయలసీమకు నికర జలాలుగా కేటాయించగలరా అని సీమ రైతాంగం ప్రశ్నిస్తుంది.

 

మొత్తానికి కనిపించి రాయలసీమ రైతులను ఏడిపిస్తున్న ఆలయం ఈ సంగమేశ్వరం. 

 

click me!