శశికళ వ్యూహాలు ఏమిటి?

First Published Feb 12, 2017, 4:25 AM IST
Highlights

ఎన్ని రోజులైనా గవర్నర్ కు విజ్ఞప్తులు చేయగలరే కానీ ఏ విధంగానూ ఒత్తిడి చేయలేరు. ఒకవేళ గవర్నర్ గనుక చిన్నమ్మపై కన్నెర్రచేస్తే శశికళ భవిష్యత్తు అక్కడితో సమాప్తం.

తమిళనాడులో ఏం జరగబోతోంది? చిన్నమ్మ వ్యూహాలేమిటి? గవర్నర్ పై ఏవిధంగా ఒత్తిడి పెంచబోతోంది శశికళ? ఇపుడు ఈ విషయాలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రశాంతంగా జరగాల్సిన ముఖ్యమంత్రి పదవి మార్పిడి వ్యవహారం గవర్నర్ కంపు చేయటంతో తమిళనాడు రాజకీయాలు గడచిన వారం రోజులుగా రోడ్డునపడ్డాయి. గంటకో మలుపు తిరుగుతూ చిన్నమ్మకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎంఎల్ఏల ఏకగ్రీవమద్దతుతో ఐదు రోజుల క్రితమే  సిఎం సీటులో కూర్చోవాల్సిన చిన్నమ్మ ఇపుడు నానాపాట్లు పడుతున్నారు.

 

రాజ్యంగబద్దంగా సిఎం పదవిలో కూర్చోవటానికి శశికళకు ఎటువంటి అడ్డంకులు లేకపోయినా విచక్షణాధికారాలపేరుతో గవర్నర్ చిన్నమ్మను అడ్డుకుంటుండటం గమనార్హం. పన్నీర్ ను సిఎం పీఠంపై కూర్చోబెట్టటానికే గవర్నర్ ఇదంతా చేస్తున్నారని చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. అటువంటిది కేంద్రమంత్రి వెంకయ్యనాయడు లాంటి వాళ్లకు తెలీకపోవటం విచిత్రం. గవర్నర్ వైఖరి చూస్తుంటే శశికళ శిబిరంలో ఉన్న ఎంఎల్ఏలందరూ పన్నీర్ వైపుకు వచ్చేంత వరకూ రాజకీయాన్ని సాగదీయాలని అనుకుంటున్నారేమో.

 

ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి పీఠం కోసం  గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుపై ఒత్తిడి తేవటానికి శశికళ వ్యూహాలు పన్నుతున్నారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయటం కూడా ఇందులో భాగమే. ‘తన సహనానికీ హద్దుందని’ చిన్నమ్మ గవర్నర్ కు రాసిన లేఖలో  స్పష్టం చేసారు. ‘శృతిమించితే ఏమి చేయాలో అదే చేస్తాం’ అని లేఖలో స్పష్టంగా పేర్కొనటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఉద్దేశ్యపూర్వకంగానే గవర్నర్ తనను కలవటం లేదని శశికళ నిర్ధారణకు వచ్చారు. జయలలిత సమాధి దగ్గర నిరాహారదీక్ష చేయటం కూడా ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. చిన్నమ్మ ఆలోచనలు స్పష్టంగా బయటపడకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

గవర్నర్ పై ఒత్తిడి పెంచాలని అనుకోవటం శశికళ  వృధా ప్రయాసే. ఎన్ని రోజులైనా గవర్నర్ కు విజ్ఞప్తులు చేయగలరే కానీ ఏ విధంగానూ ఒత్తిడి చేయలేరు. ఒకవేళ గవర్నర్ గనుక చిన్నమ్మపై కన్నెర్రచేస్తే శశికళ భవిష్యత్తు అక్కడితో సమాప్తం. గవర్నర్ వ్యవస్ధకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు, రక్షణ అంత పటిష్టంగా ఉన్నాయి. రాజ్యాంగం రాసినపుడు గవర్నర్ వ్యవస్ధను ఇంతస్ధాయికి దిగజారుస్తారని ఆనాడు అనుకోలేదేమో. ఏం చేస్తాం? ఇంకా ఇటువంటివి ఎన్ని చూడాలో.

click me!