
వృద్ధులైన తల్లి, దండ్రులను చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం వినూత్నమైన శిక్ష విధించనున్నది. వృద్ధులైన తల్లి, దండ్రులను చూసుకోవటమన్నది నిజానికి పిల్లల బాధ్యత. ఈ విషయాన్ని ఇంకోళ్ళతో చెప్పించుకోవటమో లేక గుర్తు చేసే పరిస్ధితికి చేరుకోవటమే దురదృష్టకరం. అయితే, తల్లి, దండ్రులు భారమైపోతున్నారని అనుకునే పిల్లలు ఎక్కువైపోతున్నారు కాబట్టే ఊరికో వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం అడుగుుజాడల్లో మిగిలిన ప్రభుత్వాలు కూడా నడిస్తే కొద్దిమంది తల్లి, దండ్రులకైనా ఇంట్లో కాస్త నీడ దొరుకుతుందేమో.
అటువంటి పిల్లలకు కనువిప్పుగానో లేక వారికి బాధ్యతను గుర్తుచేయటమో ఏదన్నా కానీండి అస్సాం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నది. తల్లి, దండ్రులను చూసుకోని పిల్లల్లో ఎవరైనా ఉద్యోగస్తులుంటే వారి జీతంలో కోత వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరెవరికి వృద్ధులైన తల్లి, దండ్రులున్నారనే విషయంపై వివరాల సేకరణ కూడా మొదలుపెట్టింది. మంచి ప్రయత్నమే కదా.
ఈ మేరకు అస్సాం ప్రభుత్వంలో ఆర్ధికశాఖ మంత్రి హిమాంత్ బిశ్వా సర్మ అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టారట. ఈ బిల్లుకు వ్యతరేకత ఏముంటిది? కాబట్టి బిల్లు కూడా పాసైపోతుంది. ఒకసారి బిల్లు పాసైపోగానే చట్టమైపోతుంది. దాంతో ఆ చట్టాన్ని 2017-18 ఆర్ధిక సంవత్సరం నుండే ప్రభుత్వం అమలులోకి తేవాలని అనుకుంటున్నది. చట్టం రూపంలోనైనా తల్లి, దండ్రులకు ప్రభుత్వం అండగా నిలబడుతున్నందుకు సంతోషించాలా? లేక వృద్ధులైన తల్లి, దండ్రులను చూసుకునేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సిన దుస్ధితిలో సమాజమున్నందుకు బాధపడాలో తెలియటం లేదు.