
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తనకు జరిగిన అన్యాయంపై ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. తన భర్త రాజీవ్‌కు ఉన్న సమస్యలు కుటుంబ సభ్యులకు ముందే తెలుసని, అయినా తనకు వివాహం చేశారని ఆరోపించారు. కుటుంబం తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, న్యాయం కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు.
2025 మేలో రాజీవ్‌తో తన వివాహం జరిగిందని మేఘన తెలిపారు. జోగి రమేశ్ కుటుంబంపై నమ్మకంతో పెళ్లికి అంగీకరించామని చెప్పారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయని ఆరోపించారు. రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి కుటుంబ సభ్యులకు తెలిసినా తనకు చెప్పకుండా పెళ్లి చేశారని అన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే తాము విడిపోయామని జోగి రమేశ్ చెబుతున్నారని, అసలు కారణాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
పెళ్లి తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని తన అత్త శకుంతల ఒత్తిడి చేశారని మేఘన ఆరోపించారు. సమస్యలను పరిష్కరించేందుకు కుటుంబ పెద్దలను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందన్నారు. రాజకీయ నేపథ్యం ఉందని చెప్పి తమ మాట వినాలని బెదిరించారని పేర్కొన్నారు. తన భర్తకు సంబంధించిన సమస్యలను పక్కనపెట్టి తనపైనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లికి ముందు కుటుంబం తమను హిందువులుగా పరిచయం చేసిందని, వివాహం తర్వాత వారు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న విషయం తెలిసిందని మేఘన చెప్పారు. ఇంట్లో హిందూ పూజలకు అవకాశం ఇవ్వలేదని, తాను దేవుడి ఫొటోలు పెట్టి పూజ చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని ఆరోపించారు. మతం మార్చుకోవడం తప్పు కాదని, అయితే ఈ విషయాన్ని ముందుగానే చెప్పకుండా వివాహం జరపడం తనకు అన్యాయమని అన్నారు.
తనపై జరిగిన వేధింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశానని మేఘన తెలిపారు. ఇప్పటికే బయటకు వచ్చినవి కొన్ని వీడియోలు మాత్రమేనని, మరిన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. వాటిని ఏఐ వీడియోలుగా చిత్రీకరిస్తున్నారని, అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
వివాహమైన కొద్ది కాలానికే రాజీవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని మేఘన చెప్పారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు పలువురిని కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ వివాదాల నుంచి బయటపడి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని, తనకు విడాకులు ఇప్పించి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సహకరించాలని జోగి రమేశ్‌ను కోరారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని మేఘన స్పష్టం చేశారు.