వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో తొలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ

Published : Aug 20, 2026, 09:00 PM IST
Andhra pradesh

సారాంశం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు తొలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ త‌ర‌హాలో ఏర్పాటు చేసిన తొలి ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల ఇదే.

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఇందులో చేరి ఉన్నత విద్య కొనసాగించే అవకాశం కల్పించారు. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా.. మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకం వంటి ప్రక్రియను అధికారులు చేపట్టారు.

బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్.. 30 సీట్లతో ప్రవేశాలు

తొలి ఏడాది బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సును అందించనున్నారు. మొత్తం 30 సీట్లను కేటాయించారు. ఈ కోర్సుతో పాటు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్టిఫికేషన్ కోర్సును కూడా అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో వాణిజ్య విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం విద్యార్థులకు లభించనుంది. వెదుళ్లపల్లిలో ఇప్పటికే కొనసాగుతున్న బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రాంగణంలోని తాత్కాలిక భవనాల్లో ప్రస్తుతం డిగ్రీ కళాశాలను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆగస్టు 23 నుంచి దరఖాస్తులు..

డిగ్రీలో చేరాలనుకునే అర్హత ఉన్న వినికిడి లోపం కలిగిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో కళాశాలకు వచ్చి ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై సమాచారం కోసం 90000 13633, 99483 72899 నంబర్లలో సంప్రదించవచ్చు. అందుబాటులో ఉన్న సీట్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పించనున్నారు.

ఉచిత వసతి, భోజనం..

కళాశాలలో చేరే బధిర విద్యార్థులకు ప్రభుత్వం పలు సదుపాయాలు కల్పించనుంది. ఉచిత వసతి, భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు అందించనున్నారు. కాస్మెటిక్స్‌ అవసరాలకు నగదు సహాయం, వినికిడి పరికరాలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రజియా తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అధ్యాపకుల నియామకంతో పాటు అవసరమైన వసతులను సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యకు దూరంగా ఉన్న వినికిడి లోపం కలిగిన విద్యార్థులకు ఈ కళాశాల కొత్త అవకాశాన్ని అందించనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
Jogi Ramesh: రాజీవ్‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి మ‌రీ నా గొంతు కోశారు.. జోగి ర‌మేశ్ కోడ‌లు ఆవేద‌న