విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే...: జగన్ పై సెటైర్లు, పవన్ మీద కూడా...

First Published Apr 25, 2018, 5:37 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కావాలని జగన్ కలవరించి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. 

చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అదే విధమైన కలలు కంటున్నారని ఆయన అన్నారు. అలాంటి కలలేవీ నెరవేరవని ఆయన అన్నారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ నరసింహన్ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సమీప మిత్రుడిగా మారిపోయారని ఆయన అన్నారు. 

మమ్మల్ని తిట్టడానికే పవన్ కల్యాణ్

గవర్నర్ పదవి శుద్ధ దండుగ అని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాంలాల్ ఉన్నప్పుడే గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

సంవత్సరాల తరబడి ఒకే గవర్నర్ ఎక్కడైనా ఉంటారా అని ఆయన అడిగారు. కేంద్రానికి తాబేదారుగా ఉంటూ కేంద్రం చేస్తున్న కుట్రకు సంధానకర్తగా ఉన్నారని, గవర్నర్ పదవిని కళంకితంగా మార్చారని మంత్రి అన్నారు. 

తమపై కుట్రలు జరుగుతున్నాయని, పవన్ కల్యాణ్ గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత తమను తిట్టడానికే పవన్ కల్యాణ్ సమావేశం పెట్టారని ఆయన అన్నారు.  బిజెపి సోము వీర్రాజుపై ఇంటలిజెన్స్ నిగా పెట్టాలని, ప్రజలను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక మద్దతు కోరుతున్నారని ఆయన అన్నారు. 

కేంద్రానికి దూతగా....

గవర్నర్ నరసింహన్ పనితీరుపై  మరో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీని ఢీకొంటున్న సమయంలో కేంద్రానికి దూతలా వ్యవహరించడం గవర్నర్ కు తగదని ఆయన అన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ మీద కూడా ఉందని ఆయన అన్నారు. విభజన చట్టం హామీలు అమలు జరిగేలా గవర్నర్ చూడాలి కానీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం అయ్యేలా పనిచేస్తే ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ పడుతుందని అన్నారు.

కేంద్రం ఏజెంట్...

గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా నరసింహన్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆయనను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని రఘవీరా బుధవారం మీడియాతో అన్నారు. గవర్నర్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. 

click me!