తినలేదు, మందులు వేసుకోలేదని చెప్పినా వినలేదు: జేసీ ఫైర్

By telugu teamFirst Published Jan 4, 2020, 8:38 PM IST
Highlights

జేసీ దివాకర్ రెడ్డి ఆరు గంటల నిర్బంధం తర్వాత బెయిల్ మీద పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జేసీ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పినట్లు ఆయన తెలిపారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 6గంటల తర్వాత అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ నుంచి జేసీ బెయిల్ మీద విడుదలయ్యారు. 

ఆ తర్వాత జేసీ మీడియాతో మాట్లాడారు. కోర్టు బెయిల్ తో పోలీసు స్టేషన్ కు వెళ్తే పోలీసులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా అక్రమంగా తనను పోలీసు స్టేషన్ లో నిర్బంధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: పీఎస్ లో జేసీ నిర్బంధం: ఉద్రిక్తత, కార్యకర్త ఆత్మహత్యాయత్నం

తనకు బీపీ, షుగర్ ఉందని చెప్పినా పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పారు. భోజనం చేయలేదు, మందులు వేసుకోలేదని చెప్పినా వినలేదని ఆయన చెప్పారు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని జేసీ అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున కార్యకర్తలను బెదిరించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని, పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పనిచేస్తోందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులపై జులుం చేస్తామని తాము అనలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులను అవమానిస్తూ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

Also Read: పోలీసుల ముందు జేసీ దివాకర్ రెడ్డి సరెండర్: గంటల కొద్దీ స్టేషన్ లోనే 

పోలీసు స్టేషన్ కు స్వచ్ఛందంగా వెళ్లానని చెప్పారు. తననెవరూ అరెస్టు చేయలేదని, తానేమీ దేశద్రోహిని కానని ఆయన అన్నారు. బెయిల్ పత్రాలు పరిశీలించి అరగంటలో పంపించి వేయవచ్చునని, కానీ పోలీసులు దుర్మార్గపు ఆలోచనతో తనను రోజంతా నిర్బంధించారని ఆయన అన్నారు. 

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు చేయలేదని, ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని ఆయన అన్నారు. 

click me!