చంద్రబాబు బేతాళుడు, అప్పుడు తేలుతుంది: విజయసాయి రెడ్డి

By telugu teamFirst Published Jan 4, 2020, 5:40 PM IST
Highlights

రాజధాని విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నిప్పులో తుప్పులో సీబీఐ లేదా సిఐడి విచారణ జరిగితే తేలుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి: రాజధాని అంశంపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాళ్లు విసురుతున్నారని ఆయన అన్నారు. 

సీఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలని లేఖలు రాస్తే మీరు నిప్పులో తప్పులో తేలుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శల జడివాన కురిపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల నుంచి బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు.

విక్రమార్కుడు- బేతాళ కథల్లోని బేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడని, చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరనే విషయం చంద్రబాబుకు అర్థమవుతుందని ఆయన అన్నారు. 

కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చంద్రబాబు చూస్తుంటాడని ఆయన విమర్శించారు.  గతంలో కూడా ఎన్నికల ముందు దుష్ప్రచారం చేశారని, వైఎస్ జనగ్ సీఎం అయితే భూములు లాక్కుంటారనీ ఇళ్లలోంచి వెళ్లగొడుతారనీ రౌడీ రాజ్యం వస్తుందనీ భయానకమైన దృశ్యాలు చూపించారని ఆయన గుర్తు చేశారు. 

ప్రజలు చంద్రబాబునే అధికారం నుంచి విసిరికొట్టి బుద్ధి చెప్పారని, అయినా అవే గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. తీసేసిన తహశీల్దార్లంతా పళ్లు పటపట కొరుకుతున్నారని మరో ట్వీట్ లో విజయసాయి రెడ్డి అన్నారు. విషం కక్కడంలో పోటీలు పడుతున్నారని ఆయన అన్నారు. 

వైఎస్ జగన్ నివాసం చంద్రబాబు హయాంలోనే పూర్తయిందని, అనుమతి లేకపోతే అప్పుడు నొళ్లెందుకు పెగల్లేదని ఆయన అన్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ లా నదిని పూడ్చి పెట్టి కట్టింది కాదని ఆయన అన్నారు. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.

click me!