
అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే అర్దం కావటం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. బుధవారం గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటి ఛైర్మన్ ప్రభాకర చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది లేండి. కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులుతో పాటు జెసి కూడా పాల్గొన్నారు. ఆ సందర్బంగా మాట్లాడుతూ, టిడిపిలో చేరి తాను తప్పుచేసానని పెద్ద బాంబే పేల్చారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రభాకర్ చౌదరితో పాటు ఇక్కడున్న వారంతా టిడిపిలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్న వారన్నారు. తాను మాత్రమే కాంగ్రెస్ నుండి వలసపక్షి లాగ వచ్చాన్నారు.
అంతటితో ఆగితే ఆయన జెసి ఎందుకవుతారు? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చినందుకు బాధగా ఉందని కూడా చెప్పారు. తనకు కుల పిచ్చి ఉందని అయితే, చంద్రబాబునాయుడుతో పాటు చాలా మంది టిడిపి నేతలకు ఈ విషయం తెలీదన్నారు. కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వచ్చినా చంద్రబాబు తనకేమీ కిరీటం పెట్టలేదని ఎత్తిపొడిచారు. సిఎం చెబుతున్నట్లుగా 2019లోగా ఎట్టి పరిస్ధితిలోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
రుణమాఫీ గురించి మాట్లాడుతూ, చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అంటున్నారని, అటువంటి తన వద్దకు వస్తే వారంలోగా రుణమాఫీ చేయిస్తానని హామీ ఇవ్వటం గమనార్హం. చంద్రబాబు పాలన బాగా లేదని చెప్పటంలో అర్ధం లేదని అంటూనే సిఎం పాలన పర్వాలేదన్నారు. రాష్ట్రంలో ఇద్దరే నేతలున్నారని అందులో ఒకరు చంద్రబాబు కాగా రెండో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆ పార్టీ కోలుకోలేందన్నారు. జెసి మాట్లాడిన మాటలతో వేదికమీదున్న నేతలందరూ విస్తుపోయారు.