జే బ్రాండ్ మద్యం నిషేధానికి డిమాండ్... రేపు, ఎల్లుండి టిడిపి రాష్ట్రవ్యాప్త నిరసనలు

Arun Kumar P   | Asianet News
Published : Mar 18, 2022, 11:03 AM ISTUpdated : Mar 18, 2022, 11:18 AM IST
జే బ్రాండ్ మద్యం నిషేధానికి డిమాండ్... రేపు, ఎల్లుండి టిడిపి రాష్ట్రవ్యాప్త నిరసనలు

సారాంశం

ఇప్పటికే జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీలోనూ, బయటా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష టిడిపి ఇక రాష్ట్రవ్యాప్తంగా కల్తీ సారా, జె బ్రాండ్ మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ ఆందోళనలకు సిద్దమయ్యింది. 

గుంటూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం (jangareddigudem deaths) వరుస మరణాలతో ఏపీలో ఒక్కసారిగా కల్తీ మద్యం అమ్మకాలపై ఆందోళన మొదలయ్యింది. కల్తీ నాటుసారా తాగడం వల్లే కేవలం జంగారెడ్డిగూడెంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని... దీన్ని బట్టే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష టిడిపి (tdp) ఆరోపిస్తోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ నాలుగైదు రోజులుగా ఆందోళనలు చేపడుతోంది. అయినప్పటికి వైసిపి (ysrcp) ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మకాలు, మరణాలపై స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు టిడిపి సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండురోజుల పాటు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అదిష్టానం పిలుపునిచ్చింది. 

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాదు ప్రాణాలనూ బలితీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జె- బ్రాండ్స్​ (j brand liqour) అమ్మకాలను నిషేధించాలని డిమాండ్​తో టిడిపి నిరసనలకు పిలుపునిచ్చింది. మార్చి 19,20 తేదీల్లో అంటే రేపు, ఎల్లుండి మద్యం విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ రెండురోజులు అన్ని గ్రామాలు, మండల కేంద్రాలలో టిడిపి శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. 

నాణ్యత లేని, కల్తీ మద్యాన్ని వెంటనే నిషేధించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం జే-బ్రాండ్స్ మద్యం అమ్మకాలను చేపట్టి మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే జగన్ సర్కార్ స్పందించడం లేదని మండిపడుతున్నారు. కల్తీ సారా, జె బ్రాండ్స్​పై అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా వాడవాడలో యుద్దానికి టీడీపీ సిద్దమైంది.

ఇప్పటికే జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలు కల్తీ నాటుసారా తాగడం వల్లే చోటుచేసుకున్నాయంటూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారు. నాలుగైదురోజులుగా ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వాని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వెళుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలతో అరికట్టడంతో పాటు కమీషన్ల కోసం తీసుకువచ్చిన జె బ్రాండ్ మద్యం అమ్మకాలను నిషేధించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. 

అధికార పార్టీ నాయకులు మాత్రం వైసిపి ప్రభుత్వం బురదజల్లడానికే టిడిపి ఆందోళనలు చేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు జరగడంలేదని... జంగారెడ్డిగూడెంలో అన్నీ సహజమరణాలేనని పేర్కొంటోంది. కల్తీ సారా వల్లే మరణించారని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి రాజకీయంగా లబ్ది పొందాలని టిడిపి చూస్తోందని అంటున్నారు. శవ రాజకీయాలు చేయడంలో టిడిపి ముందుంటుందని వైసిపి నాయకులు మండిపడుతున్నారు. 

ఇదిలావుంటే అసెంబ్లీలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ నిన్న(గురువారం) టీడీపీ సభ్యులు అందరినీ ఒక రోజు పాటు అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేసారు స్పీకర్ తమ్మినేని సీతారాం. టీడీపీ సభ్యులు సభ సజావుగా జరగనివ్వడం లేదని... ఎన్నిసార్లు హెచ్చరించినా పదేపదే సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ 11 మంది టీడీపీ సభ్యులను  ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశించారు.

 

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu