
దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయొద్దని బ్రదర్ అనిల్ (brother anil)పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ (Ap Christian JAC) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆ కమిటీ నాయకులు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవుడి పేరు చెప్పి అనిల్ రాజకీయం ఎందుకు చేస్తున్నారని ఆ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేశ్ కుమార్ (Suresh kumar) ప్రశ్నించారు.
అనిల్ రాజకీయాలు చేయాలనుకుంటే దేవుడిని పక్కన పెట్టాలని సురేష్ కుమార్ సూచించారు. ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే దైవ సేవకుడా స్పష్టం చేయాలని తెలిపారు. దేవుడి సందేశాన్ని చెప్పే అనిల్ ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారో తమకు తెలియడం లేదని వాపోయారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తను పార్టీ పెట్టబోనని అనిల్ చెప్పేవారని గుర్తు చేశారు. అయితే ఇటీవల విశాఖపట్నంలో మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బ్రదర్ అనిల్ కు జాగీరు కాదనే విషయాన్ని ఆయన మదిలో ఉంచుకోవాలని సురేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఉన్న క్రైస్తవులందరూ తన వెంట నడుస్తారన్న ధీమాతో బ్రదర్ అనిల్ ఉన్నారని ఆయన చెప్పారు. కానీ అది భ్రమ మాత్రమే అని చెప్పారు. ప్రతీ ఒక్కరికీ రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉంటుందని అని తెలిపారు. కానీ బ్రదర్ అనిల్ దేవుడిని ఉపయోగించుకుంటూ రాజకీయాలు చేయడం సరికాదని, ఇది తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. ఒకవేళ అనిల్ పొలిటికల్ పార్టీ పెట్టాలని అనుకుంటే దేవుడిని పక్కన పెట్టాలని సూచించారు. ప్రభువును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకూడదని సురేశ్ కుమార్ సూచించారు.