పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం.. మార్పుకు గొప్ప సంకేతం : పవన్ కల్యాణ్

By AN Telugu  |  First Published Feb 27, 2021, 1:20 PM IST

పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు 27శాతం ఓటింగ్ దక్కిందని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయం అన్నారు. 
పంచాయతీ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకమైనవని అన్నారు. 


పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు 27శాతం ఓటింగ్ దక్కిందని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయం అన్నారు. 
పంచాయతీ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకమైనవని అన్నారు. 

గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధి, పల్లెలే దేశానికీ పట్టుగొమ్మలు ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే నాయకులు చెప్పిన మాటలకు వాస్తవాలకు చాలా దూరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. 

Latest Videos

undefined

‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సముద్ర స్నానం చేసి పోరాటయాత్ర ప్రారంభించాను. అలాగే తిత్లీ తుపాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో పర్యటించాను. పంచాయతీల పరిస్థితులను స్వయంగా వీక్షించాను. తుపాన్ షెల్టర్లలో కనీస వసతులు కూడా లేవు. నాయకులు చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనే లేదు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలసలు వెళ్లిపోవడం, విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ సవ్యంగా పనిచేస్తుందా? అనిపించింది. ఒక వైపు కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్లు, సత్ఫలితాలు వచ్చినట్లు ఎక్కడా కనిపించ లేదు. దీనంతటికి ప్రధాన కారణం పల్లెలపై పెత్తనం ఒకటి రెండు వర్గాల గుప్పెట్లో ఉండటం, ఇంకా సూక్షంగా చెప్పాలంటే కొద్దిపాటి కుటుంబాల అధిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే’ అని చెప్పుకొచ్చారు. 

జనసేన పోరాట యాత్ర సమయంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో పర్యటించానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.. ‘ప్రతీ గ్రామంలో జనసైనికులను చూశాను. జనసేన పార్టీలో నాయకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ, రాష్ట్రంలో జనసైనికులు లేని గ్రామం అయితే లేదు. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆదర్శ భావాలు కలిగి, నిస్వార్థంగా పనిచేసే యువతను పంచాయతీ పోరులో నిలబెడితే బాగుంటుందనుకునేవాడిని’ అన్నారు.

అంతేకాదు.. ‘నియోజకవర్గాల్లో జరిగే పోరు కంటే గ్రామాల్లో జరిగే పోరు చాలా కష్టసాధ్యమైనది. పార్టీల పరంగా ఊరే రెండుగా విడిపోవడం చూస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో జనసైనికులు ఎంత వరకు నిలబడగలరు? ఒత్తిడిని ఎంత వరకు తట్టుకోగలరు? నేను కోరుకునే మార్పు సాధ్యపడుతుందా? అనుకునే వాడిని. మరోవైపు కొత్త పార్టీ వేళ్ళూనుకోవడం ఎంత సమయం పడుతుందనే ఆలోచనలో ఉండేవాడిని కానీ, నా వంతు ప్రయత్నం నేను చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు.

అందుకే ఈ విజయం తనకు చాలా తృప్తినిచ్చిందని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘2008లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ప్రారంభించినప్పుడు... కొత్త నాయకత్వం రావాలి, అది కూడా గ్రామ స్థాయి నుంచి రావాలని అనుకున్నాం. ఈస్ర్టన్ యూరప్ తరహాలో వెల్వెట్ రివల్యూషన్ జరగాలి, యువత, ఆడపడుచుల వల్లే అది సాధ్యమవుతుందని చాలా గాఢంగా నమ్మాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడం, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ముందుకు వెళ్లాం. 

పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు దశల్లో 1209 సర్పంచ్, 1776 ఉప సర్పంచ్, 4456 వార్డుల్లో జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం చాలా సంతోషానిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 71 శాతం 
పంచాయతీయల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. 

చాలా మంది అభ్యర్ధులు విజయం ముంగిట 10 నుంచి వంద ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మొత్తం మీద 27 శాతం ఓటింగును జనసేన పొందింది. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్లను జనసేన కైవశం చేసుకుంది. ఈ విజయం చాలా తృప్తినిచ్చింది. నేను చెబుతున్న గణంకాలు చాలా కన్సర్వేటివ్ గా చెబుతున్న గణంకాలు. 

ఈ విజయానికి ముఖ్య కారకులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జనసైనికులు,  కుల రాజకీయాలకు, అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన ఆడపడుచులు, వీరమహిళల విజయం ఇది. డబ్బుతో రాజకీయం కాకుండా ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయం ఇది. ఒక్క రూపాయి కూడా పంచకుండా, దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో జనసైనికులు బలంగా నిలిచారు. 

వాళ్లపై దాడులు జరుగుతున్నా, అధికార మదంతో అధికార పక్షం వాళ్ళు తలలు పగలగొట్టినా...  రక్తసిక్తం చేసినా, కుట్లు వేయించుకొని మరి ఎన్నికల్లో జనసైనికులు చాలా ధైర్యంగా నిలబడ్డారు. దానికి దమ్మాలపాడు గ్రామమే నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం. సామాన్యులు అసామాన్య రీతిలో గెలవడం, ఎన్ని అవాంతరాలు కలిగించినా నిలబడిన వారికి, పోటాపోటీగా పోరాడి కొద్ది తేడాతో ఓటమిపాలైన వారికి, ఇంతటి పోరులో గెలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను’ అన్నారు.

click me!