జగన్ కోసమే బీఆర్ఎస్... కేసీఆర్ ప్లాన్ అదే : నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 5, 2023, 7:23 PM IST
Highlights

జగన్ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన  రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ చీలిక తెచ్చిందని ఆయన దుయ్యబట్టారు. 
 

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని నాదెండ్ల ఆరోపించారు.జగన్‌కు సాయం అందించడానికి, జనసేన ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్ తెచ్చారని మనోహర్ వ్యాఖ్యానించారు.  ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ చీలిక తెచ్చిందని.. బీఆర్ఎస్‌తో ఏపీకి ఎలా న్యాయం చేస్తారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

175కి 175 సీట్లు గెలుస్తామంటోన్న సీఎం జగన్ ప్రతిపక్షాలకు భయపడుతున్నారని నాదెండ్ల నిలదీశారు. జనసేన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. డీజీపికి ఇప్పటికే యువశక్తి కార్యక్రమం గురించి తెలియజేశామని.. జనవరి 12న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం జరుపుతున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువత, మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతుందని మనోహర్ స్పష్టం చేశారు. 

ALso REad: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, అభివృద్దిపై బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్.. మరి వాటి సంగతేమిటి..!

కాగా.. కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరికలు మొదలైన సంగతి తెలిసిందే. తొలుత తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందుకు సంబంధించి తెర వెనక కొంతకాలంగా మంతనాలు సాగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించి కేసీఆర్ ఓ ప్రణాళిక రూపొందించారనే బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్‌ వైఖరి ప్రకటించడంతో.. తాము ఏ విధంగా అభివృద్ది చేస్తామని చెప్పడం ద్వారా ప్రజల నుంచి ఆదరణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని కొన్ని ప్రధాన అంశాలపై కేసీఆర్ ఓ స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే మరికొన్ని విషయాలపై మాత్రం బీఆర్ఎస్ వైఖరి ఏమిటనే ఆసక్తి నెలకొంది.

సోమవారం ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం మాట్లాడిన కేసీఆర్.. దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు. బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం లేదా ఒక కులం లేదా ఒక మతం కోసం ఉద్దేశించబడలేదని తెలిపారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్‌కు తోడుగా నిలవాలని కోరారు. తమ వెంట నడిచిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు ఏపీలో పలు జిల్లాల్లో నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు పరుగులు మొదలవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.


 

click me!